దిశ దశ, జగిత్యాల:
జగిత్యాలకు చెందిన ఓ యువకుడు పెరోల్ పై అతని కుటుంబాన్ని కలిసేందుకు వస్తున్నారన్న సమాచారం పట్టణమంతా గుప్పుమంది. అతని బంధువులు చనిపోవడంతో పెరోల్ తీసుకున్న ఆయనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుండడం స్థానికులను ఆశ్యర్యానికి గురి చేసింది. అయితే ఎన్ఐఏ మోస్ట్ వాటెండ్ లిస్టులో ఉన్న అబ్దుల్ సలీం ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే..?
ఉత్తర తెలంగాణ…
జగిత్యాల పట్టణానికి చెందిన అబ్దుల్ సలీం 2022 నుండి పరారీలో ఉన్నాడు. అతని కోసం ఎన్ఐఏ ఆరా తీస్తున్న ఆచూకి మాత్రం లభ్యం కాలేదు. చివరకు కడప జిల్లా మైదకూరు మండలం చెర్లోపల్లిలోని ఓ మసీదులో మత ప్రచారం చేస్తూ సేవలందించే వాడిగా షెల్టర్ తీసుకుంటున్నట్టుగా ఎన్ఐఏ అధికారులు సమాచారం అందుకున్నారు. అయితే మసీదులో ఆశ్రయం పొందుతున్న అబ్దుల్ సలీం ఎక్కువ సమయం ఆన్ లైన్ లోనే గడుపుతున్నారని గుర్తించిన స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న NIA అధికారులు 2024లో మసీదులో సోదాలు నిర్వహించారు. అబ్దుల్ సలీంను అదుపులోకి తీసుకున్న ఎన్ఐ అధికారులు విచారణ జరిపి అతన్ని కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం హైదరాబాద్ జైలులో ఉన్న సలీం సమీప బంధువులు చనిపోవడంతో కుటుంబ సభ్యులను కలిసేందుకు పెరోల్ మంజూరు చేసింది కోర్టు. ఈ మేరకు ఆయనను జగిత్యాలకు భారీ బందోబస్తు మధ్య తరలించిన పోలీసులు మద్యాహ్నం తిరిగి హైదరాబాద్ జైలుకు తరలించారు. ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సలీం అరెస్ట్ స్థానికంగా సంచలనం సృష్టించింది.
నిజామాబాద్…
నిజామాబాద్ కేంద్రంగా సాగుతున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కార్యకలాపాలపై NIA అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన NIA అధికారులు పలువురిపై కుట్రతో పాటు పలు సెక్షన్లలో 2022లో కేసు నమోదు చేశారు. అయితే ఈ క్రమంలోనే జగిత్యాల పట్టణానికి చెందిన అబ్దుల్ సలీం కూడా PFI కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నాడని గుర్తించారు. ఈ మేరకు నమోదు చేసిన కేసులో మొత్తం 11 మంది నిందితులుగా చేర్చగా అందులో ఐదో నిందితునిగా అబ్దుల్ సలీం ఉన్నాడు. PFI ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడని కూడా తేలడంతో అతని కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే జగిత్యాలను వదిలేసి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందకు కడప జిల్లా మైదకూరు మండలం చెర్లోపల్లి మసీదును ఎంచుకున్నాడని తెలుస్తోంది. PFI కార్యకలాపాల్లో పాలు పంచుకున్న అబ్దుల్ సలీంకు సంబంధించిన కదలికలపై నిఘా వేసిన ఎన్ఐఏ అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. రూ. 2 లక్షల రివార్డ్ కూడా ఆయనపై ప్రకటించారంటే అబ్దుల్ సలీం PFIతో ఎలాంటి సంబంధాలు ఏర్పర్చుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. క్రైం నంబర్ 141/2022 జులై 4న నమోదయింది. నిజామాబాద్ ఆటో నగర్ లోని ఓ ఇంట్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసును బదిలీ చేసుకున్న ఎన్ఐఏ ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించి నిందితులను అరెస్ట్ చేసింది.

