దిశ దశ, కరీంనగర్:
పీఎంజే జ్యువెల్లరీ షాపులో దోపిడీ కేసుపై ఒక్కో కీలక విషయం బయటకు వస్తోంది. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు బృందాలుగా విడిపోయి ముఠా ఆచూకి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కొన్ని పోలీసు బృందాలు మహారాష్ట్ర, మరికొన్ని బృందాలు బీహార్ రాష్ట్రానికి చేరుకుని ముఠా ఆచూకి కోసం ఆరా తీస్తున్నాయి. అయితే నిందితుల్లో ఇద్దరు పాత నేరస్తులేనని నిర్దారణ అయినట్టుగా తెలుస్తోంది. జట్టుగా ఏర్పడ్డ ఐదుగురు పీఎంజే జ్యువెల్లరీ వద్ద మాటు వేసి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే దోపిడీకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. జ్యూవెల్లరీ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో వీరికి సంబంధించిన కదలికలు రికార్డయినట్టుగా సమాచారం.
ఒకే రూట్…
అయితే మే 3వ తేది ఆదివారం ఉదయం 8.35 గంటలకు రామడుగు మండలం రుద్రారం గ్రామం నుండి రెండు బైకులు అతి వేగంగా కరీంనగర్ వైపునకు వచ్చినట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇందుకు సంబంధించిన ఫుటేజీ కూడా బయటకు రావడంతో బైకులపై వస్తున్నది దోపిడీ ముఠాకు చెందిన వారేనని అనుమానిస్తున్నారు. తిరిగి 11.35 గంటల సమయంలో రుద్రారం గ్రామం నుండి రెండు బైకులపై ఐదుగురు వ్యక్తులు వెల్తున్నట్టుగా రికార్డయింది. ఇందులో ఒక వాహనం తెలుపు రంగు, మరోకటి నలుపు రంగులో ఉన్నాయి. కరీంనగర్ జ్యూవెల్లరీ షాపులో దోపిడీ చేసిన ముఠా కూడా ఇవే రంగులో ఉన్న బైకులపై వచ్చారు. దీంతో రుద్రారంలో లభ్యమైన ఫుటేజీ దోపిడీ ముఠాకు సంబంధించినదేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే 11.42 గంటలకు జ్యూవెల్లరీ షాపులో అడ్డుకున్న ఉద్యోగులపై కాల్పులు జరిపి బయటకు పరుగు తీసిన అగంతకులు బైక్ లపై నేరుగా వెళ్లిపోయారు. 23 నిమిషాల తరువాత వీరు రుద్రారం మీదుగా వెల్లిపోతున్నట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డయింది. అయితే వీరు శాతవాహన యూనివర్శిటీ ముందు నుండి మల్కాపూర్ మీదుగా రామడుగు మండలం రుద్రారం వెళ్లారా లేక కోర్టు వెనక రోడ్డు నుండి నేరుగా మెయిన్ రోడ్డు మీదుగా కొత్తపల్లి నుండి రామడుగు చేరుకున్నారా అన్న విషయంపై క్లారిటీ రావడం లేదు. అయితే దోపిడీ ముఠా ప్రధాన రహదారులు కాకుండా గ్రామీణ ప్రాంత రోడ్ల మీదుగానే రాకపోకలు సాగించినట్టుగా భావిస్తున్నారు. ఈ కారణంగానే వారి ఉనికిని పట్టుకోలేకపోయారని తెలుస్తోంది. కెనాల్ రోడ్లు, పల్లెల మీదుగా జగిత్యాల ప్రాంతానికి చేరుకుని ఉంటారని భావిస్తున్నారు.
బీహార్ గ్యాంగ్..?
బీహార్ రాష్ట్రానికి చెందిన గ్యాంగా లేక మాహారాష్ట్రాకు చెందిన గ్యాంగా అన్న విషయం తేలాల్సి ఉంది. ఒకరిద్దరు గతంలో జైలు జీవితం గడిపినట్టుగా కూడా పోలీసులు దర్యాప్తులో తేలింది. కరీంనగర్ కు చెందిన దాదాపు ఐదు పోలీసు బృందాలు మాత్రం దోపిడీ ముఠాలకు చెందిన గ్రామ పరిసర ప్రాంతాల్లోకి చేరుకుని వారిని పట్టుకునేందుకు రంగం సిద్దం చేసినట్టుగా సమాచారం. నేడో రేపో ముఠా సభ్యులను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. అయితే కరీంనగర్ లో దోపిడీకి పాల్పడిన ముఠా మాత్రం ఇంకా స్వగ్రామానికి చేరుకోలేదని తెలుస్తోంది.

