దిశ దశ, కరీంనగర్:
రూ. కోట్ల విలువ చేసే బంగారు నగలను విక్రయించే దుకాణం అది. ఇక్కడకు వచ్చే వినియోగదారులు కూడా భారీ ఎత్తున నగదు తీసుకుని వస్తుండడం సహజం. నిత్యం రూ. కోట్లలో ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయక్కడ. అలాంటి షాపు వద్ద భద్రతా చర్యలు నామమాత్రంగానే ఉండడం విచిత్రం. అగంతకులు తమకు అనుకూలంగా ఉందని గమనించే దోపిడీకి పాల్పడ్డట్టుగా కనిపిస్తోంది. జనాల రాకపోకలు అంతంత మాత్రంగా ఉండే ఈ ప్రాంతంలోని నగల షాపులో దోపిడీ చేసినా అడ్డుకునే వారు ఉండరన్న దీమాతోనే దోచుకుని వెళ్లిపోయినట్టుగా స్పష్టమవుతోంది.
నిబంధనలు ఏవి..?
వాస్తవంగా భారీ ఎత్తున లావాదేవీలు జరిపేందుకే ఏర్పాటు చేసిన నగల షాపులో దోపిడీ ముఠాలు చొరబడే ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని సదరు సంస్థ యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదు..? గన్ లేకుండా ఉన్న సెక్యూరిటీ గార్డును మాత్రమే నియమించి భద్రత విషయంలో కట్టుదిట్టంగా ఉన్నామన్న భ్రమల్లో యాజమాన్యం ఉండిపోయినట్టుగా స్పష్టమవుతోంది. ఈ నెల 3న జరిగిన దోపిడీలో 1.600 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లగా మరో బ్యాగ్ పడిపోవడంతో దొరికింది. దోపిడీ ముఠా ఎత్తుకెళ్లిన ఆభరణాల విలువ రూ. 2 కోట్లపైగానే ఉంటుంది. అయితే దొంగల ముఠా చేజార్చుకున్న నగల సంచిలో దాదాపు 60 నుండి 80 వరకు ఆభరణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ లెక్కన ఈ బ్యాగులో కూడా కిలోకు పైగానే నగలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. కేవలం దోపిడీ ముఠా చేతికి చిక్కినవే దాదాపు 4 కోట్ల విలువ చేస్తాయని అంచనా వేసుకున్నప్పటికీ దుకాణంలో కూడా ఉన్న నగల విలువ లెక్కిస్తే రూ. 10 కోట్లకు పైమాటేనని స్పష్టమవుతోంది.

చర్యల మాటమేమిటీ..?
రూ. కోట్ల విలువైన ఆభరణాలను అమ్మేందుకు ఏర్పాటు చేసుకున్న ఈ దుకాణం వద్ద ఆయుధాలతో కూడిన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునేందుకు పీఎంజే జ్యువెల్లరీస్ సంస్థ చొరవ తీసుకోకపోవడానికి కారణమేంటన్నదే మిస్టరీగా మారింది. సాధారణ సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసుకుందే తప్ప భద్రాతా చర్యలు పాటించినట్టుగా లేదని అర్థం అవుతోంది. కనీసం డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (Door Frame Metal Detector) (DFMD)ని కూడా ఏర్పాటు చేసుకున్న దాఖలాలు కూడా లేవు. జ్యూవెల్లరీ షాపులోకి చొరబడ్డ దోపిడీ ముఠా ఆయుధాలను నడుముకు పెట్టుకునే వెళ్లినట్టుగా సీసీ ఫుటేజీలో కనిపిస్తోంది. అయితే DFMD ఏర్పాటు చేసుకున్నట్టయితే దోపిడీ ముఠా వద్ద ఆయుధాలు ఉన్నాయన్న విషయాన్ని ముందుగానే పసిగట్టే అవకాశం ఉండేది. కానీ వారు నేరుగా వెళ్లి తుపాకులు చూపించి బెదిరించినట్టుగా కెమెరాల్లో రికార్డు కావడం గమనార్హం. మరో వైపున రూ. కోట్ల విలువ చేసే ఆభరణాల క్రయ విక్రయాలు జరిపే షాపు ముందు తనిఖీలు చేపట్టేందుకు చొరవ తీసుకున్నట్టుగా కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా షాపు ఏర్పాటు చేసిన ఈ వీధిలో జనావాసాలు ఉన్నప్పటికీ రాకపోకలు సాగించే వారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఆభరణాల షాపు ఏర్పాటు చేసుకున్నప్పుడు భద్రతా చర్యలు ఏ స్థాయిలో తీసుకోవల్సి ఉంటుందోనన్న విషయం గమనించాల్సిన అవసరం ఉంది. నిత్యవసరాలు విక్రయించే డీ మార్ట్, వినోదం కోసం నడుస్తున్న సినిమా హాళ్లలో కూడా DFMD ఏర్పాటు చేస్తున్న ఈ కాలంలో కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు విక్రయించే దుకాణం వద్ద కట్టుదిట్టమైన సెక్యూరిటీ చర్యలు ఎందుకు తీసుకోలేదన్నదే అంతుచిక్కకుండా పోయింది. ఒక వేళ సంస్థ అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించినట్టయితే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదని, దోపిడీ ముఠా కూడా పక్కాగా పట్టుబడేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


