దిశ దశ, కరీంనగర్:
ప్రశాంతంగా ఉన్న కాలనీ అది… జన సంచారం లేని ప్రాంతమది… అక్కడ ఉన్న జ్యువెల్లరీ దుకాణం అయితే అన్ని రకాలుగా అనువుగా ఉంటుందని… పక్కగా రెక్కీ చేసి… పరిఫెక్ట్ స్కెచ్ వేసిన అంగతకులు దర్జాగా దోపిడీ చేసుకుని వెళ్లారు. ఘటనా స్థలంలో ఓ షార్ట్ వెపన్ కు సంబంధించిన ఓ మ్యాగ్జిన్, మూడు కాలిన తూటాలు, ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక్కడ లభ్యమైన మ్యాగ్జిన్, రౌండ్స్ పై ఉన్న క్లూస్ ఆధారంగా అవి ఎక్కడ కొనుగోలు చేశారోనన్న వివరాలు కూడా సేకరిస్తున్నారు పోలీసులు.

రక్షణ లేదనే…
కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారికి వెనక లైన్ లో ఉన్నPMJ Jewellery అయితే అన్నింటా అనువుగా ఉంటుందని అంగతకులు అంచనా వేసినట్టుగా స్పష్టం అవుతోంది. దోపిడీ జరిగిన విధానాన్ని పరిశీలిస్తే ముందుగా రెక్కి వేసుకునే వెళ్లి ఉంటారన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. జన సంచారం అంతాగా లేని PMJ Jewelleryలో దోపిడీ చేసినా సేఫ్ గా వెళ్లిపోవచ్చని అంచనా వేసుకుని ఉంటారని స్పష్టం అవుతోంది. ఒకటి రెండు రోజుల ముందే దోపిడీ దొంగలు PMJ Jewellery దుకాణం వద్దకు వచ్చి రెక్కీ నిర్వహించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జ్యూవెల్లరీలోని సీసీ కెమరాలను కానీ కరీంనగర్ లోని వివిధ చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పరిశీలించినట్టయితే దోపిడీ దొంగల కదలికలపై ఆధారాలు దొరికే అవకాశాలు ఉంటాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇందు కోసం కొన్ని బృందాలు ఆరా తీసే పనిలో పడినట్టుగా సమాచారం.

బైకులపై…
ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు రెండు బైకులపై PMJ Jewellery షాపు వద్దకు చేరుకున్నారు. సాధారణ కస్టమర్లలా లోపలకు వెళ్లి దుకాణంలోని ఓ గోల్డ్ చైన్ కొంటామని చెప్పారు. దీంతో షాపు ఉద్యోగి చైన్ తీసి ఇస్తున్న క్రమంలో చేతులు వెనక్కి కట్టేసి తుపాకులతో బెదిరించి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు ఉద్యోగులకు గాయాలు కాగా వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఒకరి తలకు గాయం అయినట్టుగా తెలుస్తోంది. నలుగురి పరిస్థితి బాగానే ఉన్నట్టుగా అధికార వర్గాలు చెప్తున్నారు. ఈ ఘటనలో షాపులోని ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు ఐదుగురు అగంతకులు.
హిందీలో…
జ్యువెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడిన వారంతా హిందీలో మాట్లాడినట్టుగా షాపులో ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంగతకుల భాషను బట్టి ఉత్తర భారతానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు.
హై అలెర్ట్…
కరీంనగర్ జ్యూవెల్లరీ షాపులో దోపిడీ ఘటనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో చెక పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రహదారులను దిగ్భందనం చేస్తున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకునే పనిలో నిమగ్నం అయ్యారు.
ఎటు వెళ్లారో…
దోపిడీకి ముందు ఎటు నుండి వచ్చారు… ఆ తరువాత ఎటు వైపు వెళ్లారు అన్న వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. బైకులను, అగంతకులను గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

