దిశ దశ, పెద్దపల్లి:
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)లో యూరియా ఉత్పత్తి మళ్లీ నిలిచిపోయింది. మంగళవారం సాంకేతిక సమస్య ఎదురుకావడంతో పరిశ్రమను తాత్కాలికంగా నిలిపివేశారు. తరుచూ RFCLలో మిషనరీ మొరాయిస్తుండడం ఆందోళన కల్గిస్తోంది. గ్యాస్ ఆదారితంగా ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో ఉత్పత్తి అవుతున్న యూరియాను నాలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియా సరఫరాపైనే ఆయా రాష్ట్రాల్లోని వ్యవసాయ రంగం ఆధారపడి ఉండడం… ఏటా సమస్యలు ఎదురవుతుండడం అటు అధికార యంత్రాంగాన్ని ఇటు రైతాంగాన్ని కలవరపెడుతోంది. తాజాగా మరోసారి ఆర్ఎఫ్సీఎల్ సేవలు నిలిచిపోవడం ఆందోళన కల్గిస్తోంది.
సీఈఓ రాక…
RFCLను సీఈఓ సంజీవ్ గులాటి సందర్శించారు. నోయిడా నుండి రామగుండం చేరుకున్న ఆయన పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝాలను కలిశారు. ఆర్ఎఫ్సీఎల్ గురించి సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అసలు సమస్య…
RFCLలో అమ్మోనియం కాయిల్ డ్యామేజ్ కావడంతో పైప్ లైన్ లీకేజ్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ పరిశ్రమకు సరఫరా అయ్యే లిక్విడ్ గ్యాస్ 93 శాతంతో రావల్సి ఉంటుందని సమాచారం. అయితే 50 నుండి 60 శాతం ప్రెజర్ తో మాత్రమే గ్యాస్ సరఫరా అవుతోందని సమాచారం. ఇటీవల 80 శాతం ప్రెజర్ తో గ్యాస్ సరఫరా అవుతున్నప్పటికీ హెచ్చు తగ్గుల కారణంగా అమ్మోనియం కాయిల్ డ్యామేజ్ అయినట్టుగా సమాచారం. ఇప్పుడున్న మిషనరీకి డ్యామేజీ కాకుండా ఉండాలంటే స్థిరంగా 93 శాతం ప్రెజర్ తో గ్యాస్ సరఫరా కావాల్సి ఉంది. అయితే హెచ్చు తగ్గులను తట్టుకోవాలంటే హెచ్టీఆర్ కాంపినెంట్ అవసరమని నిపుణులు నివేదిక ఇచ్చారు. High Temperature Reformer (HTR)ను బైపాస్ చేసి ఉత్పత్తి చేపట్టడంతో అమ్మోనియా పైప్ లైన్ తరుచూ లీకేజ్ అవుతోందని సమాచారం. HTR ఏర్పాటు చేసినట్టయితే గ్యాస్ ప్రెజర్ హెచ్చు తగ్గులను కవర్ చేసే అవకాశం ఉంటుందని సమాచారం.

