ఉత్తర సమన్వయ కమిటీ లేఖ కలకలం…
దిశ దశ, దండకారణ్యం:
దేశంలో మావోయిస్టు పార్టీ దాదాపుగా అంతరించిపోయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మావోయిస్టుల పేరిట ప్రకటన విడుదల కావడం సంచనలంగా మారింది. ఉత్తర సమన్వయ కమిటీ (NCC) పేరిట ఈ నెల 17న విడుదల చేసిన ఈ ప్రకటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

దేవ్ జీ సహా…
జన జీవనంలోకి వచ్చిన దేవ్ జీ వంటి వారి నవ ప్రచండ వాద మార్గాన్ని బహిర్గతం చేయాలని, మార్కిజం, లెనినిజం, మావోవాద జెండాను ఎగురవేయంటంటూ ఆ ప్రకటనలో పిలపునిచ్చింది కమిటీ. రాజకీయ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి రెండు సమాంతర రాజకీయ మార్గాలు ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయని, ఒకటి కార్ల్ మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో, చార్ మజుందార్, కన్హాయ్ ఛటర్జీ, బసవరాజ్, రాజు, కోసా, హిడ్మా వంటి కమ్యూనిస్ట్ విప్లకారులు అనుసరిస్తున్నదని, రెండోది బర్న్ స్టీన్, కౌత్స్కీ, లిన్ పియావో, ప్రజండ, బలరాజ్, వేణుగోపాల్, కోబాడ్, దేవ్ జీ, ప్రశాంత్ రాహి వంటి ద్రోహులు అనుసరిస్తున్నారని పేర్కొంది. రెండో మార్గం అనుసరించే వారు శత్రువుల ఏజెంట్లని, కార్మిక, రాజకీయ మార్గాన్ని బలహీన పర్చి సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని NCC ఆరోపించింది. ఈ అవకాశ వాద, విఘటన వాద శక్తులపై పోరాటం ద్వారా మాత్రమే సరైన రాజకీయ మార్గం అభివృద్ది చెందుతుందని, లెనిన్, మావో, మార్గంలో నిలబడి పోరాటం చేయడం గర్వంగా భావించాలని స్పష్టం చేసింది. 9వ కాంగ్రెస్ ఏకతా రాజకీయ మార్గాన్ని అమలు చేస్తోందని, మనలాంటి దేశాలలో ‘‘విప్లవం ప్రధానంగా సాయుధ పోరాటం ద్వారా మాత్రమే జరుగుతుంది, నవజనవాద విప్లవంలో ప్రధాన పోరాట రూపం సాయుధ పోరాటం, ప్రధాన సంస్థ రూపం సైన్యం, ప్రజల సాయుధ శక్తుల మద్దతు లేకుండా ప్రజా పోరాటాలు విజయవంతం కావు, పార్టీ గెరిల్ల యుద్దాన్ని అభివృద్ది చేసి విస్తరించడం ద్వారా మాత్రమే ప్రజా పోరాటాలను బలోపేతం చేయడంతో పాటు ప్రత్యామ్నాయ ప్రజా అధికారానికి పునాది వేయగలదు’’ అని స్పష్టంగా పేర్కొందని ఆ ప్రకటనలో వివరించింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రారంభం నుండే పార్టీ సాయుధ, అజ్ఞాతం ద్వారా ముందుకు సాగుతోందని, 2007లో ప్రపంచ కార్మిక వర్గం ముందు చేసిన ప్రతిజ్ఞను పాటిస్తున్నామని NCC వెల్లడించింది.

బలహీనం కావచ్చు…
ప్రస్తుతం పార్టీ తాము బలహీనంగా కనిపించవచ్చు కానీ వ్యూహాత్మక బలహీన మాత్రం కాదని, సరైన మార్గంలోనే కొనసాగుతున్నామని, శాస్త్రీయ సూత్రాల ప్రకారం తాము బూర్జువా విధానాలను ధ్వంసం చేస్తామని NCC స్పష్టం చేసింది. మర్క్సిజం, లెనినిజం, మావోవాదాన్ని నమ్ముతున్నాను కానీ చట్ట బద్దంగా పనిచేస్తానని పార్టీకి చట్ట బద్దత ఇవ్వాలని, నిషేధాన్ని ఎత్తివేయాలని దేవ్ జీ కోరారాని, పార్టీని పూర్తిగా చట్టబద్ద సంస్థగా మార్చడం విఘటనా వాదమని భావిస్తున్నామని అందుకే దేవ్ జీ కూడా మరో సోనూ లాంటి వ్యక్తేనని ఉత్తర సమన్వయ కమిటీ ఆరోపించింది. 1970లో కూడా పార్టీ ఇలాంటి పరిస్థితి ఎదుర్కుందని, అయినప్పటికీ తిరిగి బలపడగలిగామని, ప్రస్తుతం కేంద్ర కమిటీ వ్యూహాత్మక ప్రాంతాల్లో ప్రజా యుద్దానికి నాయకత్వం వహిస్తోందని, అత్యంత క్రరమైన శక్తులు కూడా నిలువరించలేవని తాము విప్లవ వారసత్వాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. అవకాశ వాదం, విఘటనా వాదం, సవరణ వాదాన్ని ఓఢించి నవజనవాద విప్లవాన్ని విజయవతం చేసి సామ్య వాదం, కమ్యూనిజం స్థాపన వైపు ముందుకు సాగుతామని NCC స్పష్టం చేసింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ లేఖను బట్టి మావోయిస్టు పార్టీలో ఇంకా అజ్ఞాతంలో పార్టీ నాయకత్వం పని చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. అయితే తాజాగా వెలువడిన ఉత్తర సమన్వయ కమిటీ (NCC) పేరిట ఇంతకాలం ప్రకటనలు వెలువడిన దాఖలాలు అయతే లేవు. పార్టీ నాయకత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీనా లేక గతంలో ఉన్న కమిటీనే ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చారా అన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది. మరో వైపున NCC పేరిట కావాలనే సంబంధం లేని వ్యక్తులు ప్రకటన విడుదల చేశారా అన్న తర్జనభర్జనలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ అజ్ఞాతంలో ఉన్నది కొంతమందేనని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ లేఖ మాత్రం సరికొత్త చర్చకు దారి తీసింది.


