అల్ఫోర్స్ విద్యా సంస్థల పాత్ర ప్రశంసనీయం… ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

దిశ దశ, చొప్పదండి:

తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ సంస్కరణల బాట పట్టిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం అల్ఫోర్స్ కాలేజ్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో విద్యాభివృద్ది విషయంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల పాత్ర క్రియాశీలకంగా ఉందన్నారు. అద్భుతమైన ఫలితాలు సాధించి విద్యా రంగానికి దిక్సూచిగా అల్ఫోర్స్ విద్యా సంస్థలు మారాయన్నారు. తల్లిదండ్రలు ఆశయాలను వమ్ము చేయకుండా విద్యార్థులు చదువులో రాణించాలని, విద్యతోనే సమాజంలో గొప్ప గుర్తింపు లభిస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులకు అవకాశాలు పుష్కలంగా వస్తాయని ఇందుకు అనుగుణంగా ముందుకు సాగాలని మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. అల్ఫోర్స్ అధినేత వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… 36 ఏళ్లుగా విద్యారంగంలో సేవలందిస్తున్నామని, విద్యార్థుల ఘన విజయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. తమ సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా అధ్యాపకులు అందించే సూచనలు పాటిస్తూ గొప్ప ఫలితాలను సాధిస్తున్నారని కితాబిచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 109 మంది విద్యార్థులు దేశంలోని ప్రముఖ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో సీట్లు సాధించడం సంతోషకరంగా ఉందన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే కాకుండా వారిలో విశ్వాసం నింపుతూ పోటీ పరీక్షలకు సన్నద్దులను చేసి సత్ఫలితాలను సాధించే విధంగా ప్రోత్సాహం అందిస్తున్నామని వి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా భాగంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలలో సీట్లు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు అనువైన ప్రణాళికలు తయారు చేసి అమలు చేయడంలో సఫలం అయిన అల్ఫోర్స్ అధినేత వి నరేందర్ రెడ్డిని పేరెంట్స్ ఘన సన్మానం చేశారు.