చరిత్రలో నిలిచేలా ఎంవీఆర్ శాస్త్రి 75వ జన్మదినోత్సవం
-జర్నలిజం.. ప్రజా స్వామ్యంలో నాలుగో స్తంభం.
-ప్రజా స్వామ్య పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర కీలకం
-జర్నలిస్టులు సమాజ నిర్దేశకులు
-ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధులు
-సమాజ సంక్షేమానికి నిరంతరం శ్రమించే అక్షర యోధులు పాత్రికేయులు
ఇలాంటి ఎన్నో మాటలు తరచూ వినిపిస్తుంటాయి. కానీ ఇవన్నీ నిజమేనా? ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అసలిప్పుడు జర్నలిజం ఉందా? నిజమైన జర్నలిస్టులు ఉన్నారా?
ఈ అంశాలన్నింటిపైనా ఓ నాలుగు గంటలపాటు లోతైన చర్చ జరిగింది.
ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహం వక్తల ప్రసంగాల్లో వ్యక్తమయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానం మరింతగా అందుబాట్లోకి వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియా ధోరణి, ప్రధాన మీడియాపై చూపుతున్న ప్రభావంపైనా పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. సీనియర్ పాత్రికేయులు ఎంవీఆర్ శాస్త్రి 75 వ జన్మదినోత్సవం వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ‘‘జీవిత కాల సాఫల్య పురస్కార ప్రదాన కార్యక్రమం’’ ఈ చర్చకు వేదికైంది. పాత్రికేయ రంగంలో ఎంవీఆర్ శాస్త్రి చేసిన సేవలు, రచించిన పుస్తకాలు, ఆయన వ్యక్తిత్వంపై ప్రశంసలతో ప్రసంగాలు సాగినా అంతర్లీనంగా జర్నలిజం తీరుతెన్నులపై గంభీరమైన చర్చ జరిగింది. అమృతోత్సవమైనా అక్షరోత్సవంగా…తెలుగు జర్నలిజం చరిత్రలో నిలచిపోయే విధంగా ఈ కార్యక్రమం సాగింది. ప్రస్తుత దశలో మన కర్తవ్యం ఏమిటనే విషయంలో దిశా నిర్దేశం చేసింది. జర్నలిస్టు సంఘాల బాధ్యతనూ గుర్తు చేసింది. ప్రఖ్యాత జర్నలిస్టులు, సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు, న్యాయకోవిదులు, వైద్య నిపుణులు, కవులు, రచయితలు, ఇందులో పాలుపంచుకున్నారు. ఏప్రిల్ 22న హైదరాబాద్ సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో ఈ కార్యక్రమం జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది హాజరయ్యారు.

మిగిలిన మూడు స్తంభాలకన్నా మీడియా మేలే
మీడియా పూర్తిగా చెడిపోయిందని ఇప్పుడు అందరూ అంటున్నారు. జర్నలిజం కొంత దయనీయ స్థితిలో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలపైన శాసన, న్యాయ, కార్యనిర్వహక వ్యవస్థలతో పోలిస్తే ఇప్పటికీ మీడియా తన గౌరవాన్ని పొందుతోందని సీనియర్ పాత్రికేయుడు ఎంవీఆర్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. అయితే మీడియాను కొత్త దిశలో తీసుకెళ్లేందుకు, జర్నలిజం స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవస్థను, ప్రభుత్వాలను సక్రమ మార్గంలో పయనింపజేయడానికి మీడియా కృషి చేస్తే ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వ్యక్తిగత , అనసవర కుటుంబ విభేదాలు, సెలబ్రిటీల గొడవలు ఇవి వార్తలు కాదని, ఇలాంటి వాటిని సోషల్ మీడియా ప్రధానంగా ఇస్తుండటంతో ప్రధాన మీడియాకూడా ఆ బాటలో నడుస్తోందని అన్నారు. ఇది కుక్కను తోక నడిపిస్తున్నట్లుగా ఉందన్నారు. అసలైన జర్నలిజాన్ని కాపాడుకోవలసిన అవసరముందని… అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ … మాధ్యమం ఏదైనా విశ్వసనీయమైన వార్తలు ప్రజలకు అందాలన్నదే తన కోరిక అన్నారు. ఒక ట్రస్టు ఏర్పాటు చేసి …విరాళాలతో మీడియాను ప్రారంభించబోతున్నానని, మార్పును కోరుకునే వారు తనతో కలసి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియాకు రాజ్యంగ పరంగా ఎలాంటి రక్షణ లేకపోవడాన్ని గమనించాలని కోరారు. ఈ రక్షణ కోసం పోరాడాల్సిన అవసరముందన్నారు. జర్నలిజంలో ఒక ఉద్యమం రావాల్సిన అవసరం ఉందన్నారు. యువ జర్నలిస్టులు చర్యాపరమైన దృక్పథంతో ముందుకు రావాలని సూచించారు. సమాజంలో నిజాయితీతో పనిచేసే జర్నలిస్టులు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారని, మిగతావారు ప్రలోభాలకు లోనవుతున్నారని ఆయన అన్నారు. జర్నలిస్టులు స్వతంత్రంగా పనిచేయగలగాలని, ప్రజల సమస్యలను వెలుగులోకి తేవాలని చెప్పారు. జర్నలిస్టుల పని పరిస్థితులు కూడా బాగోలేవని, చాలా మంది తక్కువ జీతాలతో పని చేస్తున్నారని, రిటైర్మెంట్ తర్వాత సామాజిక భద్రత, వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి కోసం జర్నలిస్టు సంఘాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.

జర్నలిస్టులు ప్రభుత్వానికి మార్గదర్శకులుగా ఉండాలి
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల్ గౌడ మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రభుత్వానికి మార్గదర్శకులుగా, ఉండాలని అన్నారు. జర్నలిజం సులభమైన వృత్తి కాదన్నారు. ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు ధైర్య సాహసాలు అవసరమని పేర్కొన్నారు. జర్నలిజం ప్రజలకు దిక్సూచిగా ఉండాలని, అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అన్నారు. ఎంవీఆర్ శాస్త్రి గొప్ప ఫిలాసఫర్, స్టేట్స్‌మెన్, సోషల్ ఇంజినీర్, థింకర్, ఐడియాలజిస్ట్, అనలిస్ట్ , లాయర్, జడ్జి అని అభివర్ణించారు.

దేశం, ధర్మం పట్ల బాధ్యత అవసరం
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త , రుషిపీఠం పత్రిక సంపాదకులు సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడతూ పాత్రికేయులు దేశం, ధర్మం పట్ల బాధ్యత కలిగి ఉండాలన్నారు. నిజాయితీ, నిర్భీతి, నిజం పట్ల నిబద్ధత కలగలసిన అసమాన పాత్రికేయుడు ఎంవీఆర్ శాస్త్రి అని కొనియాడారు. జర్నలిస్టులకు ఆయన మార్గదర్శి అని పేర్కొన్నారు. దేశమంటే మట్టి కాదోయ్ మనుషులు అంటారు. దాంతోపాటు దేశమంటే సంస్కృతి, సంప్రదాయం కూడా అని నిర్వచించారు.

సమాజ హితమే ప్రధాన లక్ష్యం కావాలి
జర్నలిస్టుల ప్రధాన లక్ష్యం సమాజ హితం కావాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. నైతిక విలువలు, సాహసం, ప్రతిపక్ష పాత్ర పోషించడం, నిరంతర సత్యాన్వేషణల్లో ఎంవీఆర్ శాస్త్రి జర్నలిస్టులకు ఆదర్శమని పేర్కొన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ మాట్లాడుతూ ఎంవీఆర్ శాస్త్రి నిబద్ధతను, నైపుణ్యాన్ని కొనియాడారు. దేశానికి ఇలాంటి జర్నలిస్టుల అవసరం ఉందన్నారు. వారి రచనలు, పుస్తకాలు యావత్ దేశాన్ని ప్రభావితం చేశాయన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం, ప్రమాణాల పెంపుకోసం తమ యూనియన్ కృషి చేస్తోందని తెలిపారు.
75 ఏళ్ల వయసులో సెకండ్ ఇన్నింగ్స్
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మీడియాకు స్వాతంత్య్రం తగ్గిందని పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, దానిని ఎత్తిచూపాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. మీడియా గౌరవాన్ని పెంచేవిధంగా ఎంవీఆర్ శాస్త్రి 75 ఏళ్ల వయసులో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం గొప్ప విషయమని అన్నారు.
జర్నలిజం…జన యిజం
హాస్యబ్రహ్మ శంకరనారాయణ మాట్లాడుతూ శాస్త్రిని పాత్రికేయ విశ్వనాథుడు అని అభివర్ణించారు. వృత్తిలో అత్యంత నిక్కచ్చిగా ఉండే ఆయనను యమవీర శాస్త్రిగా పిలుచుకునే వారని చెప్పారు. జర్నలిజం జనయిజం అని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులకంటూ ఒక వైఖరి ఉండాలని జీ న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ సూచించారు. జాతీయ వాదం ఏ ఒక్క పార్టీదో కాదన్నారు. జాతీయ వాద జర్నలిస్టులకు ఎంవీఆర్ శాస్త్రి మార్గదర్శి అన్నారు.
జర్నలిజం ఎప్పటికీ సమాజానికి దిశా నిర్దేశం చేసే శక్తిగానే ఉండాలి
జర్నలిస్టులంటే క్రమంగా గౌరవం తగ్గుతోందని విజయక్రాంతి, మెట్రో ఇండియా పత్రికల అధినేత సీఎల్ రాజం అన్నారు. ప్రజా సమస్యలపై విస్తృతంగా సంపాదకీయాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిజం గౌరవ మర్యాదలతో పాటు విలువలు పెంచుకోవాలని ఆయన సూచించారు. పాత తరం వారికే కాకుండా యువజర్నలిస్టులకూ ఎంవీఆర్ శాస్త్రి ఆదర్శమని అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంత కీలకమో ఆయన తన కలం పదునుతో చూపించారని కొనియాడారు. జర్నలిజం ఎప్పటికీ సమాజానికి దిశా నిర్దేశం చేసే శక్తిగానే ఉండాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని పిలుపునిచ్చారు.
హాజరైన పాత్రికేయ దిగ్గజాలు
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ , తెలుగువన్ ఎడిటర్ శ్రీరామ్ , టీ న్యూస్ డిప్యూటీ ఎడిటర్ సూరజ్ భరద్వాజ్, హెచ్ఎం టీవీ డిప్యూటీ ఎడిటర్ శివప్రసాద్, మెట్రో ఇండియా ఎడిటర్ మోహన్ దివాకర్, దర్శనం ఎడిటర్ ఎం. వి. ఆర్. శర్మ, రిఫ్లెక్షన్స్ చానెల్ అమోఘ్ దేశపతి, సీనియర్ జర్నలిస్టులు వనం జ్వాలా నరసింహారావు, భండారు శ్రీనివాసరావు, మాడభూషి శ్రీధర్, నందిరాజు రాధాకృష్ణ, చలసాని నరేంద్ర, ఆనంద వర్ధన్, రాధాకృష్ణ, వైజయంతి, మదన్ గుప్తావంటి ప్రముఖులు పాల్గొనటం ద్వారా మీడియా సభకు నిండుదనం తెచ్చింది. సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్ అధ్యక్షత వహించగా, కోటి రెడ్డి సభానిర్వహణ చేశారు. విశ్రాంత ఉన్నతాధికారులు ఐవైఆర్ కృష్ణారావు, బిపి ఆచార్య, సి. ఉమామహేశ్వరరావు, అజయ్ మిశ్రా, తెలుగుదేశం పార్టీ నాయకుడు తొండపు దశరథ జనార్దన్, వేణుగోపాలరెడ్డి, వడ్డి విజయసారధి లు హాజరయ్యారు. ఇటీవలే భారత రక్షణ శాఖ కార్యదర్శిగా పదవీవిరమణ చేసిన ఐఎఎస్ అధికారి ఎ. గిరిధర్, ప్రజ్ఞాభారతి హనుమాన్ చౌదరి, , శ్యామ్ ప్రసాద్, మల్లికార్జున్ జీ, ప్రొఫెసర్ మురళీ మనోహర్ వంటి ఎందరో సామాజిక వేత్తలు హాజరయ్యారు. ” వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర నేతలు రాణాప్రతాప్, నందనం కృపాకర్ , రావికంటి శ్రీనివాస్, ఎన్ ఎస్ రావు, క్రాంతి, నర్సయ్య, నగర అధ్యక్షుడు బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

-రావికంటి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్
హైదరాబాద్
మొబైల్: 9908892067

