భారీ ఆపరేషన్ సక్సెస్…
ముగ్గురి అరెస్ట్…
కోనసాగుతున్న పోలీసుల వేట…
దిశ దశ, కరీంనగర్:
కరుడుగట్టిన నేరస్తుల ముఠా అది… పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడంలో పక్కా స్కెచ్ వేస్తుంది. హత్యలు చేయడం అత్యంత సహజమని భావించే ముఠా… వారి పేరు చెప్తేనే ఆయా రాష్ట్రాల పోలీసులు తమకెందుకు తలనొప్పి అనుకుంటారని ప్రచారం… అటువంటి ఘరానా గ్యాంగ్ మెంబర్స్ ను కరీంనగర్ పోలీసుులు అరెస్ట్ చేసి తమ స్పెషాలిటీ ఏంటో చేతల్లో చూపించారు. సుబోధ్ గ్యాంగు సభ్యులను అరెస్ట్ చేయడంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ముఠా అంతా ఇతర నేరాల్లో అరెస్ట్ అయినా సుబోధ్ గ్యాంగ్ సభ్యులయిన తరువాత మాత్రం పోలీసులకు చిక్కలేదు. తాజాగా కరీంనగర్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
పీఎంజే…
కరీంనగర్ జ్యోతీనగర్ లోని పీఎంజే జ్యువెలరీ షోరూంలో ఈ నెల 3న దోపిడీకి పాల్పడిన సుబోద్ గ్యాంగ్ సభ్యులు ఐదుగురు 161.4 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్ర ఆభరణాలను దొంగలించుకపోయారు. వారిని పట్టుకోవడం అసాధ్యమేనని అనుకున్నప్పటికీ ముగ్గురిని అరెస్ట్ చేసి కరీంనగర్ పోలీసులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. నిందితుల నుండి గోల్డ్ రికవరీ చేయలేకపోయినప్పటికీ గ్యాంగ్ మెంబర్స్ ఆచూకి దొరకబట్టడమే గ్రేట్ అని అంటున్నారు ఇతర రాష్ట్రాల పోలీసులు. పీఎంజే జ్యువెలర్స్ లో దోపిడీకి పాల్పడిన వారిలో పశ్చిమ బెంగల్ రాష్ట్రంలోని అసన్సోల్ సౌత్ తాలుకా మల్లిక్ పడ సాల్వన్ కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీర్ సింగ్ (41) బీహార్ లోని నలంద జిల్లా హిల్సా తాలుకా గవాల్ బిఘాకు చెందిన రావిష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్ (23), నేరం చేసేందుకు సిమ్ కార్డులను అంద జేసిన పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూరోద్దీన్ రోడ్ కు చెందిన మెహతాబ్ ఖాన్ (32)లను అరెస్ట్ చేశామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మీడియాకు వివరించారు. ఈ కేసులో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 13 మంది నిందితుల భాగస్వామ్యం ఉన్నట్టుగా గుర్తించామని తెలిపారు. మిగతా నిందితులు, దోపిడీ చేసిన ఆభరణాల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. దోపిడీ చేసిన వారిలో రాధే అలియాస్ అభయ్ అలియస్ ప్రమోద్ గోస్వామి, మిశ్రా, సూర్యమణి కుమార్ అలియాస్ సనోజ్ లు పరారీలో ఉన్నారని తెలిపారు.
ఎవరికి వారే…
గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్ మానిటరింగ్ చేసే ఇలాంటి గ్యాంగ్స్ దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. అయితే దోపిడీ చేసే వారికి ఒకరికి ఒకరితో సంబంధం లేకుండానే ఓ చోట కలిసే విధంగా స్కెచ్ వేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. రాబరీ గ్యాంగ్ స్టర్ గా మారిపోయిన సుబోధ్ సింగ్ అంతా జైలు నుండే ముఠాలను నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అతనిపై కూడా కుట్ర సెక్షన్లలో పోలీసులు కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారు. పీటీ వారెంట్ ద్వారా సుబోధ్ సింగ్ ను కరీంనగర్ కోర్టులో హాజరు పర్చాలన్న విషయంపై చర్చిస్తున్నట్టుగా సమాచారం. మిగతా నిందితులందరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి సుబోధ్ గ్యాంగ్ ను పట్టుకున్న చరిత్ర తెలంగాణా పోలీసుల సొంతం కావాలన్న ఆలోచనతో ఉన్నారు కరీంనగర్ వారియర్స్. అయితే దోపిడీలో పాల్గొన్న వారికి ఓ కోడ్ అందించి వారందరిని ఒక చోటకు చేర్చే విధంగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలోని పలు చోట్ల దోపిడీకి అనువైన ప్రాంతం గురించి గుర్తించేందుకు దాదాపు రెండు నెలల పాటు సంచిరించిన ఈ ముఠా రెక్కీ నిర్వహించిన తరువాత కానీ తుపాకులు అందించలేదు. మే 1న వీరికి మహారాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లా గడ్ చందూర్ వద్ద ముఠాతో సంబంధం లేని వ్యక్తి వచ్చి ఆయుధాలు అప్పగించి వెళ్లాడు. దోపిడీ చేసిన తరువాత సొత్తను తీసుకెళ్లేందుకు అదే వ్యక్తి కారులో రాగా వాటిని పికప్ చేసుకుని వెల్లిపోయాడు. ఆయుధాలు కూడా తీసుకున్న తరువాత అతను నగలను కొనుగోలు చేస వ్యాపారులకు చేర్చడం… అక్కడ లావాదేవీలు జరగడం చకాచకా సాగిపోయయి.

