ట్రిప్లెక్స్ విల్లా… అగ్రికల్చర్ ల్యాండ్… కిలోలకొద్ది గోల్డ్…

చీఫ్ ఇంజనీర్ ఆస్తుల చిట్టా ఇదే…

దిశ దశ, హైదరాబాద్:

ఎదిగినా కొద్ది వెనుకేసుకునే పనిలో నిమగ్నమైనట్టుగా ఉంది ఆ ఇంజనీర్ చీఫ్ స్టైల్… స్థాయికి తగ్గట్టుగా ఆస్తులను కూడబెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడన్న ఆరోపణలపై తెలంగాణ ఏసీబీ అధికారులు తీగ లాగితే డొంకంతా కదిలింది. రిజిస్ట్రేషన్ వాల్యూయేషన్ ప్రకారమే కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులను ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు గుర్తించారు. సదరు ఇంజనీర్ గారికి సంబంధించిన సమగ్ర వివరాలు సేకరిస్తే ఇంకా ఆస్తులు బయటపడే అవకాశాలు ఉన్నాయన్న చర్చ సాగుతోంది. రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ జరుప్లాపై మంగళవారం తెలంగాణ ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాడులు చేశారు. ఏక కాలంలో 15 చోట్ల ఏసీబీ అధికారలు సోదాలు జరిపి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆస్తుల చిట్టా ఇదే..!

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని గుర్తించిన ఏసీబీ అధికారులు R & B చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ జరుప్లాపై అవినీతి నిరోధక చట్టం 1988, సెక్షన్ 12 (1) (బి). 12 (2)లలో కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం నుండి మోహన్ నాయక్ ఆఫీసు, ఇళ్ళు, బంధువులు, సహచరుల, బినామాలకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో దాడులు చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ముల్లంగిలో రూ. 82,89,750 విలువ చేసే 19.38 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో 3, గచ్చిబౌలిలో 4 మొత్తం ఏడు ప్లాట్ల విలువ రూ. 7,34,73,867, మియాపూర్ లో దాదాపు రూ. 2,50,00,000 విలువ చేసే ట్రిప్లెక్స్ విల్లా ఒకటి, కూకట్ పల్లిలో సుమారు రూ. 62,14,000 విలువ చేసే నూతన ఇళ్లు, నిజామాబాద్ లో కొత్త నిర్మించిన విల్లా రూ. కోటి అడ్వాన్స్ గా చెల్లించినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంట్లో రూ. 55 లక్షల నగదు, రూ. కోటి 44 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ. 2 కోట్ల విలువైన రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు, రూ. 3.60 లక్షల విలువైన వెండి వస్తువులు, రూ. కోటి 26 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ. 11. 25 లక్షల విలువైన 9 మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, 4 ల్యాప్ ట్యాపులు, రూ. 25 లక్షల విలువ చేసే రెండు వాహనాలను గుర్తించారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ విలువ ప్రకారం రూ. 17, 94, 62, 617 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్టుగా ఏసీబీ అధికారులు ప్రకటించారు. అదనపు ఆస్తులకు సంబంధించిన వివరాలు ధృవీకరణ చేస్తున్నామని తెలిపారు.

వంద కోట్లు..!

చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ వద్ద లభ్యమైన ఆస్తుల డాక్యూమెంట్లను పరిశీలించిన ఏసీబీ అధికారులు ప్రభుత్వ లెక్కల ప్రకారమే విలువను వెల్లడించారు. కానీ బహిరంగ మార్కెట్లో వాటి విలువు రూ. వంద కోట్లపైగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా రోడ్లు భవనాల శాఖకు చెందిన ఉన్నతాధికారిపై ఏసీబీ అధికారులు దాడులు చేయడం సంచలనంగా మారింది. చీఫ్ ఇంజనీర్ లక్ష్యంగా ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో ఆ విభాగంలో కలకలం మొదలైంది. అవినీతి అక్రమార్కులపై మరిన్ని దాడులు జరుగుతాయా ఇంతటితో ఆగిపోతాయా అన్న చర్చ ఆ విభాగంలో సాగుతోంది. మోహన్ నాయక్ వద్ద లభ్యమైన ఆస్తులకు సంబంధించిన వివరాలే కాకుండా ఏవైనా క్లూస్ దొరికినట్టయితే మాత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆ దిశగా కూడా సోదాలు నిర్వహించేందుకు రంగం సిద్దం చేసుకునే అవకాశం ఉంది.