దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాలు అంతరించిపోయినా… అడవుల్లో ఏర్పాటు చేసిన డంపులు మాత్రం అలాగే ఉండిపోయాయి. దీంతో బలగాలు నక్సల్స్ డంపులను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యాయి బలగాలు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో డంప్ ను గుర్తించారు. ఎస్పీ ఎం రమేష్, అడిషనల్ ఎస్పీలు కార్తీక్ మధిర, గోకుల్ రాజ్ జిల నేతృత్వంలో BDDSకు చెందిన ఆరు బృందాలు, మరో రెండు పోలీసు టీమ్స్ సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగించాయి. ఇటీవల జనజీవనంలో కలిసిన మావోయిస్టు పార్టీ కేడర్ ను ప్రశ్నించినప్పుడు డంపుల గుట్టు తెలిసింది. దీంతో వెంటనే గడ్చిరోలి పోలీసులు రంగంలోకి దిగి డంప్ ను గుర్తించారు. జిల్లాలోని పోమ్కెన్ బినగుండకు ఉత్తర అటవీ ప్రాంతంలో ఈ డంప్ ను గుర్తించారు. ఇందులో ఒక లేత్ మిషన్, BGL పైపులు, 12 బోర్ పైపు, ఇన్వర్టర్, జనరేటర్, బ్యాటరీ, గ్రైండింగ్, డ్రిల్లింగ్ మిషన్, జిగ్సా సా మిషన్, ప్రెషర్ పంప్, సోలార్ ప్యానెల్, 20 అడుగుల ఫుట్ వాల్ పైప్ తదితర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలను తయారు చేసేందుకు మావోయిస్టులు ఈ సామాగ్రిని సేకరించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అలాగే అడవుల్లో పోలీసులను, బలగాలను మట్టబెట్టేందుకు నక్సల్స్ మందుపాతరలు అమర్చి ఉంటారని వాటిని గుర్తించాలన్న లక్ష్యంతో మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు ప్రత్యేక దృష్టిం సారించారు. భవిష్యత్తులో అటవీ ప్రాంతాల్లో సంచరించినప్పుడు మందు గుండు పేలితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఇప్పుడే వాటిని నిర్వీర్యం చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే మావోయస్ట్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఆయుధ కర్మాగారాలు కూడా బయటపడుతుండడం గమనార్హం.


