ఆ సీలింగ్ భూముల్లో మరో ట్విస్ట్…

పట్టాదారుల పేర్లూ గల్లంతు…

దిశ దశ, జగిత్యాల:

కొడిమ్యాల మండలం రాంసాగర్ సీలింగ్ భూముల వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సీలింగ్ భూములను విక్రయించారని గుర్తించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ భూములకు సంబంధించిన క్రయ విక్రయాల దస్తావేజులు కూడా చెల్లవని స్పష్టం చేస్తూ ప్రొసిడింగ్స్ ఇచ్చారు. అయితే ఈ సీలింగ్ భూములు అసలు పట్టాదారుల పేరిట కాకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని కాకుండా సంబంధంలేని వ్యక్తుల పేర్లు రికార్డుల్లో నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏకంగా రెవెన్యూ రికార్డులనే తారుమారు చేసి తమ పేర్లను నమోదు చేసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది.

పట్టాదారులు…

కొడిమ్యాల మండలం రాంసాగర్ గ్రామంలోని 22.26 ఎకరాల భూమి పునుగోటి లక్ష్మణ్ రావు తండ్రి మంగారావు అసలైన పట్టదారుగా ఉన్నారని గ్రామస్థులు చెప్తున్నారు. సీలింగ్ చట్టం ప్రకారం అదనంగా ఉన్న ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించి సీలింగ్ ట్రిబ్యూనల్ ఆమోదం తెలపడంతో పాటు హై కోర్టు కూడా పిటిషన్ దారుల అభ్యర్థనను తిరస్కరించింది. ఇదంతా కూడా ప్రభుత్వ రికార్డుల ఆధారంగానే సాగింది. అయితే అనూహ్యంగా ఈ భూముల విషయంలో కబ్జాదారుల కాలంలో మరోకరి పేరు రికార్డుల్లోకి ఎక్కడం ఏకంగా పట్టాదారులగా కూడా వారి పేర్లే ఎక్కించడం విస్మయానికి గురి చేస్తోంది. సీలింగ్ యాక్ట్ అమలు చేసిన భూమి విషయంలో రెవెన్యూ అధికారులు మమకారం చూపించడానికి కారణమేంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. అసలు పట్టాదారుల పేరిట ఆ భూములు కొనసాగాల్సి ఉన్నప్పటికీ సంబంధం లేని వారి పేర్లు ఎలా చేర్చారన్న విషయం తేలాల్సి ఉంది. సీలింగ్ భూముల విషయంలో నేటికీ పట్టాదారుల పేర్లు రికార్డుల్లో ఉన్నాయి కానీ సంబంధం లేని వ్యక్తుల పేర్లు మాత్రం పహాణీల్లోకి ఎక్కించలేదు.

ఇంటి దొంగలేనా..?

జగిత్యాల రెవె‘‘న్యూ’’ రికార్డులు తయారు చేయడంలో ఇంటి దొంగల ప్రమేయం పక్కాగా ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. అటు పట్టాదారుల పేరిట కాకుండా ఇటు సీలింగ్ భూమి అని మార్చకుండా సంబంధం లేని పేర్లను పట్టాదారులుగా మార్చిన తీరు ఉన్నతాధికారులను సైతం విస్మయపరుస్తోంది. సర్కారు పరిధిలో పని చేయాల్సిన అధికార యంత్రాంగం ప్రైవేటు వ్యక్తుల కొమ్ము కాయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసిడింగ్స్ ఆధారంగా అయితే మాత్రం రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారం సాగిందని తేటతెల్లం అయిపోయింది. ఈ వ్యవహారంపై రెవెన్యూ ఉన్నతాధికారులు సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ధరణీ అమలు చేసిన సమయంలో పట్టాదారుల పేర్లు మార్చి వేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని.

కుట్ర కోణమా..?

ఓ వైపున ట్రిబ్యూనల్, హై కోర్టు సీలింగ్ భూములని తేల్చినా కూడా జగిత్యాల రెవెన్యూ అధికారులు మరోకరి పేర్లను పట్టాదారులు ఎలా చేర్చడం వెనక అసలేం జరిగిందన్న చర్చ స్థానికంగా సాగుతోంది. సీలింగ్ ట్రిబ్యూనల్ ఆదేశాల తరువాత అయినా ఆ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టుగా రికార్డులు మార్చకపోవడం వెనక ఏమైనా కుట్ర దాగి ఉందా అన్న అనుమానమూ వ్యక్తం అవుతోంది. థర్డ్ పార్టీ పేర్లు రికార్డుల్లోకి ఎక్కించారంటే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికార యంత్రాంగం తమవంతు చేయూత అందించిందని స్పష్టమవుతోంది.

దళితుల భూములు…

అయితే కొడిమ్యాల పునుగోటి లక్ష్మణ్ రావు తండ్రి మంగారావుకు చెందిన ఈ భూములను దళితులకు, ఒక ఒసి కేటగిరికి చెందిన వారికి కెటాయిస్తూ జిల్లా కలెక్టర్ ప్రొసిడింగ్స్ ఇచ్చారు. లబ్దిదారులకు ఇచ్చిన ప్రొసిడింగ్ కాపీలు తీసుకుని పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పారని అంటున్నారు. తమకు అలాట్ చేసిన ప్రొసిడింగ్ కాపీలను తీసుకుని మోసం చేశారని బాధితులు జిల్లా కలెక్టర్ కు, సీఎంఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన అధికారులు అసలు విషయాలు బయటకు తీశారు. ఒక వేళ ఈ భూములు సీలింగ్ పరిధిలో కాకుండా, పట్టాదారుల పేరిట లేనట్టయితే లబ్దిదారులను ఎలా ఎంపిక చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్టుగా రెవెన్యూ అధికారులు మాత్రం అక్రమార్కులకు కొమ్ము కాయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటో కూడా తేల్చాల్సిన అవసరం ఉంది.