ఊటూరు ఇసుక రీచులో అసలేం జరుగుతోంది..?

దిశ దశ, కరీంనగర్:

ఇసుక రీచుల మాటున జరుగుతున్న అక్రమాల జాతరను నిలువరించే వారు లేరా..? ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మాఫియాను కట్టడి చేసే వారు లేరా..?

ఊటూరు రీచ్…

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు ఇసుక రీచులో కూడా నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియంత్రించాల్సిన TGMDC యంత్రాంగం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్న సాకు మాటున నిబంధనలు తుంగలో తొక్కి మరీ తవ్వకాలు జరుపుతున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది.

నదిలోనే…

ఊటూరు ఇసుక రీచులో కూడా మానేరు నదిలోనే లారీల లోడింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. పర్యావరణ నిబంధనలకు విరుద్దంగా సాగుతున్నా కట్టడి చేసే వారు లేకుండా పోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం లారీల రాకపోకలతో మానేరు నది దద్దరిల్లిపోతున్నా అభ్యంతరం చెప్పే వారు లేకుండా పోయారు. దీంతో స్టాక్ యార్డుల వరకే పరిమితం కావల్సిన లారీలు మానేరు నదిలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మిషనరీ సాయంతో నది మధ్యలోనే ఇసుక లోడింగ్ చేస్తూ తమను అడ్డుకునే వారు ఎవరూ లేరన్న దర్జాతనాన్ని ప్రదర్శిస్తున్నారు కాంట్రాక్టర్లు.

తవ్వింది ఎంత..?

తవ్వుకున్నోళ్లకు తవ్వకున్నంత అన్నట్టుగా మారిపోయింది కరీంనగర్ జిల్లాలోని ఇసుక రీచుల తీరు. మానకొండూరు మండలం ఊటూరు ఇసుక రీచులో నీటి గుంతల సమీపంలోనే తవ్వకాలు జరుపడమే కాకుండా అక్కడే లారీల్లో లోడింగ్ చేస్తున్నారు. వాస్తవంగా 2 మీటర్ల కంటే ఎక్కువ లోతు తీయకూడదని నిబంధనలు చెప్తున్నాయి. ఊటూరు ఇసుక రీచులో జరిపిన తవ్వకాలపై కొలతలు తీస్తే నిబంధనలు అమలవుతున్నాయా లేవా అన్నది స్పష్టం కానుంది. ఇసుక తవ్వకాలు జరిపిన కారణంగానే కొన్ని చోట్ల గుంతలు ఏర్పడ్డాయని వాటి కొలతలు కూడా తీసినట్టయితే అసలు విషయం తేలుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని మానేరు నదిలో ఏర్పాటు చేసిన ఇసుక తవ్వకాలపై గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వకాలు జరిపారని నిర్దారించిన NGT తుది తీర్పు కూడా ఇచ్చింది. ఈ విషయంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో చర్యలు తీసుకోలేదని సమాచారం. తాజాగా జరుగుతున్న తవ్వకాలపై కూడా పిటిషన్లు దాఖలు చేసినట్టయితే అధికారులు మళ్లీ ఇరకాటంలో పడడం ఖాయమని అంటున్న వారూ లేకపోలేదు. TGMDC అధికారులు కేవలం లారీల్లో ఇసుక నింపడమే తమ పని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కానీ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం ఇసుక రీచుల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు స్థానికులు.