విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా DGGIకి ఫిర్యాదు…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లాలోని వివిధ క్వారీల నుండి అక్రమంగా రవాణా అయిన గ్రానైట్ వ్యవహారం చుట్టూ ఫిర్యాదుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. విజిలెన్స్ అధికారులు 2013లో ఇచ్చిన అప్రైజల్ రిపోర్ట్ ఆధారంగా విచారణ జరిపి జరిమానాతో సహా జీఎస్టీ వసూలు చేయాలని కోరుతూ Directorate of GST Intelligence (DGGI)కి ఫిర్యాదు వెళ్లింది. తాజాగా కరీంనగర్ జిల్లాలోని ఆసిఫ్ నగర్ కు చెందిన శ్రీకాంత్ దాసరిని DGGI అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గ్రానైట్ ఇండస్ట్రీలో తయారవుతున్న పాలిషింగ్ గ్రానైట్ ప్లేట్లను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు తరలించినప్పటికీ జీఎస్టీ చెల్లించలేదని DGGI అధికారులు గుర్తించారు. రూ. 16 కోట్ల మేర జీఎస్టీని ఎగవేసినట్టుగా తేల్చిన అధికారులు అరెస్ట్ చేయడంతో పాటు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే విజిలెన్స్ అధికారులు ఇచ్చిన అప్రైజల్ రిపోర్ట్ ఆధారంగా అప్పుడు విదేశాలకు చేరిన గ్రానైట్ అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ న్యూ ఢిల్లీలోని DGGI కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.

వివరాలు ఇలా…

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 29.05.2013లో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అప్రైజల్ రిపోర్ట్ నెం: 60 (సి.నెం.268/NR1/2013) ప్రకారం కరీంనగర్ జిల్లాలోని క్వారీల నుండి కాకినాడ, విశాఖపట్నం తదితర సీపోర్టుల నుండి 768889.937 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ఎగుమతి అయినట్టుగా అంచనా వేశారని, ఈ రిపోర్ట్ ఆధారంగా సెంట్రల్ జీఎస్టీ (CGST)ని ఆధారాలతో సహా వసూలు చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు. అప్రైజల్ రిపోర్ట్ ఆధారంగా రూ. 124,94,46,147/ సీనరేజ్ ఎగవేసినట్టుగా తేలిందని దీని ఆధారంగా CGST మదింపు చేసి వసూలు చేయాలని అభ్యర్థించారు. CGST చట్టాన్ని, నిబంధనలు అనుసరించి జరిమానాతో కూడిన జీఎస్టీని వసూలు చేయాలని కోరారు. ఈ విషయంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ED) అధికారులు కూడా సోదాలు చేశారని, ఈ మేరకు ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారని వెల్లడించారు. బినామీ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరిగాయని, గ్రానైట్ బ్లాకులు తరలించేప్పుడు లెక్కకు చూపని నగదు లావాదేవీలు జరిగాయని ఈడీ అధికారులు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో వివరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. చైనాకు చెందిన సంస్థల నుండి భారత్ కు పత్రాలు లేకుండానే అప్పు ఇచ్చినట్టుగా నగదు మళ్లించినట్టుగా తేల్చినట్టుగా పేర్కొన్నారని తెలిపారు. చైనా సంస్థలు పనామా లీక్స్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెన్‌హువోకు చెందినవని ఈడీ అధికారులు ఆ ప్రకటనలో వివరించారని తెలిపారు. రూ. 500 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయానికి, సీబీఐకి కూడా ఫిర్యాదు చేశామని వీటిని పరిగణనలోకి తీసుకుని DGGI అధికారులు విచారణ చేపట్టి CGST ఎగవేత కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. కరీంనగర్ సమీపంలోని గ్రానైట్ క్వారీల నుండి తరలిపోయిన అక్రమ గ్రానైట్ లెక్కలు తేల్చి పెనాల్టీతో సహా వసూలు చేయాలని కోరారు.