అప్పుడలా… ఇప్పుడిలా… ‘‘దానం’’కు కలిసిరాని పార్టీ ఫిరాయింపు…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ నేత దానం నాగేందర్ పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు హై కోర్టు తీర్పు వెలవరించడంతో దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవిని వదులుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. 2023లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుండి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 2024 మార్చి 17 కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అదే సంవత్సరం జరిగిన ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న నాగేందర్ పై పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు. అయితే స్పీకర్ ట్రిబ్యూనల్ ఆయన పార్టీ ఫిరాయించలేదని తేల్చి చెప్పడంతో ఆయన పార్టీ మారారని ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యేలిద్దరూ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసింది.

కలిసి రావడం లేదా..?

అయితే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారం కలిసి రానట్టుగా స్పష్టం అవుతోంది. గతంలో కూడా ఆయన ఆసిఫ్ నగర్ నుండి టీడీపీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2004లో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో ఆయన ఓటమి చవి చూశారు. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయనపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయించగా స్పీకర్ ట్రిబ్యూనల్ నాగేందర్ పార్టీ ఫిరాయించలేదని తేల్చింది. తిరిగి హైకోర్టుకు ఆధారాలు సమర్పించడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఓ పార్టీ నుండి గెలిచి మరో పార్టీతో చెట్టాపట్టాల్ వేసేందుకు పావులు కదిపిన దానం నాగేందర్ కు రెండు సార్లు కూడా చుక్కెదురే అయింది. 2004లో ప్రజా కోర్టులో ఓటమి చవి చూసిన నాగేందర్ నేడు హైకోర్టు తీర్పుతో పదవిని కోల్పోవల్సి వచ్చింది. ఏది ఏమైనా హైదరాబాద్ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తారని పేరున్న దానం నాగేందర్ ఎదుర్కొంటున్న ప్రతికూల ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి.