దిశ దశ, కరీంనగర్:
పేషెంట్: సార్ నేను ఫలానా అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నాను… పరిష్కారం చూపండి.
డాక్టర్: మీరు నాన్ వెజిటేరియన్ తినండి మీ ఆరోగ్యం కుదుటపడుతుంది…
పేషెంట్: సార్ నేను శాఖాహారిని మాంసాహారం తినను.
డాక్టర్: నేను చెప్తున్నాను కదా మీరు నాన్ వెజ్ తినాల్సిందే… అప్పుడే మీ ఆరోగ్యం బాగు పడుతుందంటూ భరోసా…
ఏం చేయాలో పాలుపోక ఆ పేషెంట్ డాక్టర్ గదిలోంచి బయటకు వెళ్లిపోయాడు.
ఇలా కరీంనగర్ లో నిత్యకృత్యంగా మారిన నూతన చికిత్స విధానం గురించి తెలుగు రాష్ట్రాలలో చర్చ నీయాంశంగా మారింది. మెడిసిన్స్ మానేయండి… నాన్ వెజ్ తినండి షుగర్ తగ్గాలంటే డైట్ మార్చుకోండి… మందులు అవసరమే లేదు… మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండంటూ ఓ డాక్టర్ చేస్తున్న ప్రసంగం తాలుకూ రీల్స్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమని నమ్మిన పేషెంట్లు భారీగా ఆ డాక్టర్ వద్దకు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పేషెంట్లు ఆ డాక్టర్ అపాయింట్ మెంట్ తీసుకునేందుకు భారీగా పైరవీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ డాక్టర్ మాత్రం పైరవీలకు తావుండదని, పేషెంట్లు నేరుగా తన వద్దకు రావాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆయన గురించి విన్న బాధితులు పెద్ద సంఖ్యలో చికిత్స కోసం ఆ ఆసుపత్రికి రావడం మొదలు పెట్టారు. తెల్లవారు జాము నుండే పేషెంట్లు క్యూ కడుతున్నారంటే ఆ డాక్టర్ క్రేజీ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ డాక్టర్ వద్ద చికిత్స చేయించుకునేందుకు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు కూడా వస్తున్నారంటే ఆయనంటే ఏ స్థాయిలో విశ్వసనీయత పెరిగిందో గమనించాలి.
ట్విస్ట్ ఇక్కడే…
అయితే సదరు డాక్టర్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారం నిబంధనలకు విరుద్దంగా సాగుతోందని మందులు లేకుండానే పక్షవాతాన్ని నివారించవచ్చని, కేవలం ఆహారం ద్వారానే మధుమేహం (షుగుర్) నియంత్రించవచ్చని చెప్తుండడం వైద్య శాస్త్ర విధానానికే విరుద్దంగా వ్యహరిస్తున్నారని డాక్టర్స్ అసోసియేషన్లు అబిప్రాయపడుతున్నాయి. వైద్య వృత్తిలో కొనసాగుతున్న వారి విలువ తగ్గించే విధంగా నడుచుకోవడం వంటి చర్యలపై ఐఎంఏ, ఫిజియన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. కొంతమంది పేషేంట్లను మందులు వాడకూడదన్న సలహా ఇవ్వడంతో వారికి రోగం తిరగబెట్టడంతో మరో ఆసుపత్రిలో చేరిన సంఘటనలు కూడా ఉన్నాయని IMA, APIలు గుర్తించింది. దీంతో డాక్టర్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు సదరు డాక్టర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వైద్య వృత్తి నైతికత దెబ్బ తీసే విధంగా నడుచుకోవడం సరికాదని, పేషంట్లు తీసుకుంటున్న చికిత్స విధానం సరికాదని అసోసియేషన్స్ ప్రతిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు మళ్లీ పూనుకున్నట్టయితే డాక్టర్స్ అసోసియేషన్స్ తీవ్రంగా పరిగణిస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేసినట్టుగా సమాచారం.


