ప్రైవేటు ఉద్యోగయితే బల్దియాకు ఏం సంబంధం..?
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కార్పొరేషన్ నిర్ణయాలు అత్యంత విచిత్రంగా ఉంటున్నాయి. తమకేమీ సంబంధం లేదంటూనే చర్యలు తీసుకున్నట్టుగా ప్రకటించిన తీరు చర్చకు దారి తీస్తోంది. ఈ విషయంలో మేయర్ జారీ చేసిన ప్రకటన అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.
అసలేం జరిగిందంటే..?
కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ సువార్త ఇంట్లో చోరీ జరిగిందని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులు సువార్త ఆరోపణల మేరకు ఆమె ఇంట్లో పని చేస్తున్న శానిటేషన్ బదిలీ వర్కర్ అయిన లక్ష్మిని విచారించారు. ఈ నేపథ్యంలో లక్ష్మిని పోలీసులు వేదింపులకు గురి చేశారన్న ఆరోపణలు రావడం కమిషన్ గౌష్ ఆలం జోక్యం చేసుకుని బాధ్యులైన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. అయితే అడిషనల్ కమిషనర్ ఫిర్యాదు చేసిన తరువాత నగలు ఆమె కారులోనే దొరకడంతో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. నమోదు చేయని కేసులో పోలీసుల జోక్యం ఎక్కువ కావడంతో క్రమశిక్షణా చర్యలకు గురి కావాల్సి వచ్చింది. అయితే చోరీ జరిగిందని ఫిర్యాదు చేసిన అడిషనల్ కమిషనర్ సువార్త ఇంట్లో పని చేస్తున్నది మునిసిపల్ వర్కర్ అని విస్తృతంగా ప్రచారం జరిగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని బాధితురాలు లక్ష్మిని పరమార్శించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే నిబంధనలకు విరుద్దంగా శానిటేషన్ వర్కర్ ను సొంత అవసరాలకు ఉపయోగించుకోవడం ఏంటన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. కార్పొరేషన్ పరిధిలోని కాలనీల్లో పనిచేయాల్సిన వర్కర్ ను ఇంట్లో పనికి పురమాయించుకోవడం సరికాదన్న వాదనలు వినిపించాయి.
మేయర్ ప్రకటన…
అయితే ఈ విషయంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ చేసిన ప్రకటన బల్దియాలో చర్చనీయాంశంగా మారింది. అడిషనల్ కమిషనర్ సువార్తకు మెమో జారీ చేశామని, ఆమె ఇంట్లో పని చేస్తున్న లక్ష్మీ ప్రైవేటు ఉద్యోగని వెల్లడించారు. అయితే ప్రైవేటు వ్యక్తిచే పని చేయించుకుంటున్న అడిషనల్ కమిషనర్ కు కార్పొరేషన్ అధికారులు మెమో జారీ చేసే అదికారం ఎలా ఉంటుందన్న చర్చ సాగుతోంది. అడిషనల్ కమిషనర్ ఇంటి అవసరాలకు ప్రైవేటు వ్యక్తిని నియమించుకుంటే అది ఆమె వ్యక్తిగత విషయం అవుతుంది కానీ బల్దియాకు ఎలాంటి సంబంధం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటప్పుడు కార్పొరేషన్ అధికారులు అడిషనల్ కలెక్టర్ కు మెమో జారీ చేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. అడిషనల్ కమిషనర్ ఇంట్లో పని చేస్తున్న లక్ష్మి బదిలీ వర్కర్ విధానంలో తన కూతురుకు బదులుగా విధులు నిర్వర్తిస్తున్నట్టుగా బహిరంగంగానే చెప్తున్నారు. మునిసిపల్ వర్కర్లు అనారోగ్యానికి గురైతే తాత్కాలికంగా ప్రత్యామ్నాయ వర్కర్లను నియమించుకునే వెసులుబాటు కల్పించారని, ఇదే విధానంలో లక్ష్మీ అడిషనల్ కమిషనర్ ఇంట్లో బదిలీ వర్కర్ గా పని చేస్తున్నారని మునిసిపల్ వర్కర్లు అంటున్నారు. అయితే మేయర్ మాత్రం లక్ష్మీ ప్రైవేటు ఉద్యోగి అని ప్రకటించడమే కాకుండా ఈ విషయంలో అడిషనల్ కమిషనర్ కు మెమో జారీ చేశామని తెలపడం విస్మయానికి గురి చేస్తోంది.

