హుజురాబాద్ డంపింగ్ యార్డ్ చర్చ
దిశ దశ, హుజురాబాద్:
హుజురాబాదో సమీపంలో రెండు కార్పొరేషన్లు, 7 మునిసిపాలిటీల చెత్తను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఈ ప్రాంత వాసులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే డంపింగ్ యార్డ్ కు సంబంధించిన ప్రతిపాదనలు ఎప్పుడు మొదలయ్యాయి..? ప్రభుత్వం ఉత్తర్వులు ఎప్పుడు జారీ చేసింది అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయిక్కడ. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం నుండి మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరక్టర్ ఆఫీసుకు పంపిన ఓ లేఖలో పేర్కొన్న సంవత్సరమే ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలకు అసలు కారణం అవుతోంది. లెటర్ తయారు చేస్తున్నప్పుడు సంవత్సరం తప్పుగా పడి ఉంటుందని కొందరు అంటుంటే లేదు లేదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు చేశారంటూ మరి కొందరు వాదిస్తున్నారు. ఒక్క చోట మాత్రమే సంవత్సరం వేరుగా ప్రింట్ కావడంతో స్థానికంగా ఎవరికి వారు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు.
కరస్పాండెన్స్ ఇలా…
హుజురాబాద్ సమీపంలోని డంపింగ్ యార్డ్ కోసం జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు మాత్రం 2024లోనే జరిగినట్టుగా రెఫరెన్సులను బట్టి స్పష్టం అవుతోంది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుండి మొదలు ప్రతి చోట కూడా 2024వ సంవత్సరం అనే స్పష్టంగా పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి రాసిన లేఖలో Lr.No. E1/1874/2024 Dated 23-03-2022 అని ఉంది. అయితే రెఫరెన్సుల్లో పేర్కొన్న తేదీలు మాత్రం 2024కు సంబంధించనవే ఉండగా, హుజురాబాద్ ఆర్డీఓ కార్యాలయం నుండి విడుదలైన లేఖ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరక్టర్ కార్యాలయం నుండి విడుదలైన లేఖలన్ని కూడా 2024లోనే విడుదలైనట్టుగా పేర్కొన్నారు. అయితే పమేలా సత్పతి కలెక్టర్ కార్యాలయం నుండి పంపిన ఒక్క లేఖలో మాత్రం 2022 అని పేర్కొనడంతో గత ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు మొదలయ్యాయన్న ప్రచారం మొదలైంది. అయితే ఈ లేఖ నంబర్ వేసిన అధికారులు 2024 సంవత్సరంలోనే పంపించినట్టుగా పేర్కొనగా లేఖ పంపించిన డేట్ వద్ద మాత్రమే 2022 అని ఉంది. ఉత్తర ప్రత్యుత్తరాలన్ని కూడా 2024లోనే జరిగినట్టుగా ఉన్నప్పుడు ఒక్క చోట 2022 అని ముద్రించి ఉన్నంత మాత్రాన అప్పటి ప్రతిపాదనలని చెప్పడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నారు. అంతేకాకుండా 2022లలో కరీంనగర్ కలెక్టర్ గా పమేలా సత్పతి పనిచేయలేదన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఒకవేళ 2022లోనే సిర్సపల్లి సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం ప్రతిపాదలను చేసినట్టయితే రెఫరెన్సుల్లో అప్పటి లేఖ నంబర్ తో పాటు తేదీ కూడా స్పష్టంగా పేర్కొనేవారని అంటున్నారు. మరోవైపున సాధారణంగా ప్రభుత్వ అధికారులు ఉత్తర ప్రత్యుత్తారలకు నంబర్లు వేసినప్పడు అది ఏ సంవత్సరమో తెలియజేసేందుకు చివరన ఆ సంవత్సరం వేయడం ఆనవాయితీ అని, కలెక్టర్ పమేలా సత్పతి రాసిన లేఖ నంబర్ తరువాత 2024 అని ఉందని, డేట్ లో మాత్రమే 2022 అని ఉందని ఇది తప్పుగా పడి ఉంటుంది తప్ప 2022కు సంబంధించిన లేఖ కాదని చెప్తున్నారు. హుజురాబాద్ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉధ్యమంలో ఈ 2022 అనే డిజిట్ ఈ ప్రాంతంలోని రాజకీయ నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు అసలు కారణంగా మారిపోయింది. జిల్లా అధికార యంత్రాంగం కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్టయితే బావుంటుందన్న అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి.


