ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన అంశాలివే…
దిశ దశ, జగిత్యాల:
సర్కారు సొమ్ము ఏమైపోతే మాకేంటీ మా జీత భత్యాలు మాకు వస్తున్నాయని నిర్లక్ష్యం ప్రదర్శించినట్టుగా ఉంది. వాహనాలు పోయినా, పన్నులు వసూలు కాకున్నా మాకేం బాధ లేదు అన్నట్టుగా నడుకున్నట్టుగా ఉంది. జగిత్యాల మునిసిపల్ కార్యాలయంలో 10 గంటలకు పైగా కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో మునిసిపల్ అధికార యంత్రాంగం పనితీరు ఎలా ఉందో అర్థం అవుతోంది…
2020లో…
జగిత్యాల మునిసిపాలిటీకి చెందిన ఒక ట్రాక్టర్ 2020లో అదశ్యం అయితే దాని ఆచూకి ఇంతవరకూ దొరకలేదని, 2022లో నాలుగు ఆటోలు కూడా మిస్సయ్యాయని వాటి గురించి పట్టించుకున్న వారే లేరని ఏసీబీ అధికారుల తనిఖీల్లో బట్టబయలు అయింది. ఇకపోతే వెహికిల్స్ రిపేర్లకు సంబంధించిన చెక్కులు మునిసిపల్ ఏఈ ఎంఏ అనిల్ పేరిట డ్రా చేశారని తేలింది. డిడిఓ నిబంధనల ప్రకారం మరమ్మత్తులు చేసిన కంపెనీల పేరిట చెక్కులు విడుదల చేయాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు గుర్తించారు. మునిసిపల్ వాహనానలను జగిత్యాలలో రిపేర్లు చేయించకుండా కరీంనగర్ కోతిరాంపూర్ లోని తెలంగాణ ఆటో మొబైల్స్ కు సర్వీసింగ్ కు పంపించారని, మునిసిపల్ వాహనాలకు లాగ్ బుక్ మెయింటెన్ చేయలేదని ఏసీబీ గుర్తించింది. ఇంధన వినియోగం, మీటర్ రీడింగులను లాగ్ బుక్స్ లలో సక్రమంగా నమోదు చేయలేదని కూడా తేల్చింది. మునిసిపల్ కాంప్లెక్స్ లో 194 దుకాణాలు ఉండగా 18 ఏళ్ల క్రితం జరిగిన టెండర్లలో దక్కించుకున్న వారే షాపులు నడుపుతున్నారని ఆ తరువాత టెండర్లకు మళ్లీ పిలవలేదని, మూడేళ్లకోసారి టెండర్లు నిర్వహించాల్సి ఉందని ఏసీబీ పేర్కొంది. షాపులకు సంబంధించిన రిజిస్టర్ మెయింటెన్ చేస్తున్న అందులో అద్దె వసూళ్లకు సంబంధించిన వివరాలు రికార్డ్ చేయడం లేదని, రికార్డుల నిర్వహణ ఆదాయ వసూళ్లలోనూ అవకతవకలు జరిగాయని తేలింది. మునిసిపల్ డీఈఈ పాముకుంట్ల ఆనంద్ కుమార్ మొబైల్ ఫోన్ తనిఖీ చేయగా 2025 జులై నెలలో రూ. లక్ష అనుమానస్పద లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించింది. 9047 LRS దరఖాస్తుల్లో 1944 దరఖాస్తుకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించినట్టుగా ఉందని వీటిలో 1003 అప్లికేషన్లను ఆమోదించారని, 206 తిరస్కరణకు గురయ్యాయని, 735 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని ఏసీబీ విచారణలో తేలింది. యూనిఫారమ్స్ కొనుగోళ్లలో అవకతకవలు, స్టాక్, పేమెంట్ రిజిస్టర్లు నిర్వహించడం లేదని, ఫాగింగ్ కోసం ఉపయోగించే కెమికల్ రిజిస్టర్ పరిస్థితి అలాగే ఉందని, స్టేషనరీ బిల్లలకు సంబంధించిన GST బిల్లులు సమర్పించలేదని, బిల్లులపై డేట్స్ లేవని, ఆథరైజ్డ్ బిల్లులు కూడా లేవని ఏసీబీ గుర్తించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్వాధీనం చేసుకున్నట్టుగా, సదరు ప్లాస్టిక్ ను రీసైక్లింగుకు పంపించిన రికార్డులు కూడా లేవని, మునిసిపల్ ఉద్యోగు హాజరు రిజిస్టర్ కూడా సక్రమంగా నిర్వహించడం లేదని, ఉద్యోగులు బయోమెట్రిక్ వ్యవస్థను కూడా ఉపయోగించడం లేదని ఏసీబీ స్పష్టం చేసింది.

ACB Inspector Poornachander
పన్నుల వసూళ్లలోనూ…
ఇకపోతే మునిసిపాలిటీకి రావల్సిన ఆదాయం విషయంలోనూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏసీబీ విచారణలో తేలింది. 2025-26 సంత్సరంలో ఆస్తి పన్నులు రూ. 14,76,10,000లు వసూలు చేయాల్సి ఉండగా 7,52,64,000లు, షాపింగ్ కాంప్లెక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ రూ. 2,35,07,000లకు గాను 1,43,19,000, అడ్వర్టైజ్ మెంట్ ట్యాక్స్ రూ. 8,12,510కి గాను ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదని ఏసీబీ గుర్తించింది. జగిత్యాల మునిసిపాలిటీకి ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ. 17,19,29,510 వివిధ రకాల పన్నుల రూపంలో ఆదాయం రావల్సి ఉండగా రూ. 8,95,83,000లు మాత్రమే వసూలు అయ్యాయి. కరీంనగర్ ఏసీబీ ఇన్స్ పెక్టర్ పూర్ణచందర్ ఆధ్వర్యంలో దాదాపు 10 గంటలకు పైగా తనిఖీలు జరిగాయి. ఇంకా కొన్ని రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉందని ఏసీబీ అధికారులు చెప్తున్నారు.

