కరీంనగర్ సీపీ స్పెషల్ నజర్…
దిశ దశ, కరీంనగర్:
మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ క్రిమినల్స్ కోట్లలో డబ్బు దోచుకపోతున్న తీరుపై కరీంనగర్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సైబర్ నేరగాళ్లు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను గుర్తించడంతో పాటు వీరికి అత్యంత కీలకంగా మారిన బ్యాంకు అకౌంట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కొత్త అకౌంట్లు ఓపెన్ చేసేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా కరంట్ అకౌంట్లు ఓపెన్ చేసే ప్పుడు క్రాస్ చెక్ చేసుకోవల్సిన అవసరం ఉందన్నారు. చాలా మంది కమిషన్లకు ఆశపడి మ్యూల్ అకౌంట్లు తెరిచేందుకు ముందుకు వస్తున్నారని ఆ అకౌంట్ల ద్వారా సైబర్ క్రిమినల్స్ డబ్బు దోచుకెల్తున్నారని వివరించారు. బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసేప్పుడు విధిగా స్క్రూటినీ చేయాలని, డాక్యూమెంట్స్ వెరిఫికేషన్ చేయాలన్నారు. కరంట్ అకౌంట్ల విషయంలో సైట్ విజిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ లో ఆపరేషన్ క్రాక్ డౌన్ ద్వారా 68 Mule Accounts గుర్తించామని 20 కేసులు నమోదు చేసి 26 మందిని అరెస్ట్ చేశఆమన్నారు. రెండు విడుతలుగా చేపట్టిన ఆపరేషన్ క్రాక్ డౌన్ కార్యక్రమం ద్వారా మ్యూల్ అకౌంట్లపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నామని సీపీ గౌష్ ఆలం బ్యాంకర్లకు వివరించారు. కొన్ని సందర్భాల్లో బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా మ్యూల్ అకౌంట్ల విషయంలో తమవంతూ సహకారం అందిస్తున్నారని వారిపైనా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేయడం వాటి ద్వారా జరిగే లావాదేవీలకు కూడా సహకరిస్తున్నట్టుగా తేలితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పోలీసులు మ్యూల్ ఖాతాలను గుర్తించడం వాటిని నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేయడానికే పరిమితం అయ్యారు. తాజాగా బ్యాంకర్లకు కూడా మ్యూల్ అకౌంట్ల విషయంపై అవగాహన కల్పించేందుకు చొరవ తీసుకోవడం విశేషం.

