మన బ్యాంకులు ఎంత భద్రం?

ముందస్తు చర్యలేవి?

 

సెక్యూరిటీ ఎలా ఉంది..?

 

దిశ దశ, కరీంనగర్: 

 

కరీంనగర్ జ్యూవెలరీ దోపిడీ ఘటన చెప్పిన వాస్తవమేంటి? దోపిడీ గ్యాంగ్ చేసిన హెచ్చరిక ఏమిటి? భద్రతా చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందా?

బ్యాంకుల వద్ద… 

ప్రభుత్వ రంగ బ్యాంకులే అయినా ప్రైవేటు బ్యాంకులే అయినా వాటి వద్ద భద్రతా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అన్న విషయంపై సమీక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కేవలం సీసీ కెమెరాలు, నామమాత్రంగా ఏర్పాటు చేసిన సెక్యూరిటీ ఫోర్స్ తప్ప పకడ్బందీ చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటాయన్నది బహిరంగ రహస్యం. రిటైర్డ్ ఆర్మీ అధికారులను నియమించుకుని వారికి డబల్ బ్యారెల్ గన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నిత్యం ఆర్థిక లావాదేవీలతో రద్దీగా ఉండే బ్యాంకుల ముందు కాసే పహారా రికార్డుల కోసం తప్ప రియాలిటీ కోసం అయితే కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

 

టర్నోవర్… 

 

రోజూ కోట్లలో టర్నోవర్ అయ్యే బ్యాంకుల వద్ద ఒకే ఒక వ్యక్తి ఆయుధంతో సంచరిస్తుంటారు. బ్యాంకు అధికారులకు అవసరం పడినా, యంత్రాంగానికి పని పడినా ఆ సెక్యూరిటీ గార్డు వారికి సేవలందించాల్సిందే. కరీంనగర్ PMJ జ్యువెలరీ షాపులో దోపిడీ చేసేందుకు వచ్చిన గ్యాంగ్ ఫైరింగ్ చేసినట్టుగా బ్యాంకుల్లోకి చొరబడి కాల్పులు జరిపితే ఎదురొడ్డి పోరాడగలిగే సత్తా అక్కడ పహారా కాస్తున్న సెక్యూరిటీకి ఉంటుందా లేదా అన్నది ఆయా బ్యాంకుల యాజమాన్యాలకే తెలియాలి. ముప్పేట దాడి చేసే ముఠాల చర్యలను తిప్పిగొట్టే పరిస్థితిపై సమీక్షించుకోవల్సిన అవసరం ఉంది. బ్యాంకు లావాదేవీలు జరిగే వేళల్లో అయితే రద్దీ ఉంటుంది కానీ సాయంత్రం వేళల్లో అయితే అన్ని పనులు చక్కబెట్టుకునే సిబ్బంది మాత్రమే ఉంటారు. ఈ సమయంలో దోపిడీ ముఠాలు చొరబడితే ప్రతిఘటించే పరిస్థితి ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోతోంది.

 

సీసీ కెమెరాలు?

 

ఇకపోతే సీసీ కెమెరాల పనితీరు కూడా అంతంతేనన్న అభిప్రాయాలు. వ్యక్తం అవుతున్నాయి. బ్యాంకులోపల ఉన్నవి తప్ప ఏటీఎంలలో ఏర్పాటు చేసిన కెమెరాలు హైక్వాలిటీతో కూడుకున్నవి కాదని తెలుస్తోంది. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఏకంగా ఏటీఎంను ఎత్తుకెళ్లినా నిందితులకు సంబంధించిన విజువల్స్ క్లారిటీగా రికార్డు కాలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితి అన్ని ఏటీఎంల వద్ద ఎదురవుతున్నదేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వకుండా, వాటిని మెయింటైన్ చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల దోపిడీ జరిగిన తరువాత దర్యాప్తునకు ఎలాంటి క్లూస్ లభించే అవకాశాలు లేవు. దీంతో పోలీసులు కేసులను పెండింగులో పెట్టక తప్ననిసరి ఏర్పడుతోంది. 

 

కాంట్రాక్టు…

 

చాలా వరకు బ్యాంకుల్లో తీసుకుంటున్న భద్రతా చర్యలు కాంట్రాక్టు విధానంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. కాంట్రాక్టర్లు ఒప్పందం ప్రకారం రక్షణ చర్యలు చేపడుతున్నారా లేదా అన్న విషయంపై బ్యాంకుల యాజమాన్యాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.  ఒక్క నగదు రవాణా చేసే వాహనాలు తప్ప  మిగతా బ్యాంకింగ్ వ్యవస్థ అన్నింటా కూడా భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేరం జరిగిన తరువాత కట్టడి గుర్తించడానికి బదులు నేరాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

 

రామగుండంలో…

 

కరీంనగర్ ఘటన నేపథ్యంలో రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బ్యాంకులపై ప్రత్యేక దృష్టి సారించారు. బ్యాంకుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉందో పరిశీలించాలని ఆదేశించారు. ఈమేరకు రామగుండం పరిధిలోని పోలీసు అధికారులు బ్యాంకుల భద్రతా చర్యలపై క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఆయా బ్యాంకులకు రక్షణ చర్యలపై లేఖలు రాశారు. ఈ సందర్భంగాా అనుమానస్పద వ్యక్తులను గుర్తించేందుకు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. బ్యాంకులు, ఏటీఎం సెంటర్లలో ఏర్పాటు చేసిన అలారం వ్యవస్థ పనితీరును పరిశీలించారు. గోదావరిఖని ఏసీపీ ఎం  రమేష్ నేతృత్వంలో సీఐలు ఇంద్రసేనాారెడ్డి, అఫ్జలోద్దీన్, ప్రసాద్ రావు, కృష్ణ కుమార్ తో పాటు పలువురు ఎస్సైలు బ్యాంకులను పరిశీలించారు.