దిశ దశ, జగిత్యాల:
ఈ నెల 3 తేదిన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నగల షాపులో దోపిడీకి పాల్పడిన ముఠా గురించి పోలీసులు వేటాడుతున్నారు. బీహార్, మహారాష్ట్ర, తెలంగాణల్లో ముఠా గురించి వాకబు చేస్తున్న పోలీసులు దోపిడీ చేసిన తరువాత ఏఏ రూట్లలో వెళ్లారో కూడా తెలుసుకున్నారు. ఈ క్రమంలో వీరు రామడుగు మండలం మోతె రుద్రారం, ధర్మపురి, బీర్పుర్ అటవీ గ్రామాల మీదుగా పరార్ అయ్యేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. అయితే ముఠా ఖచ్చితంగా బీర్పుర్, కలమడుగు ప్రాంతాల్లోనే ఉండి ఉంటుందన్న అనుమానంతో దాదాపు 200 మంది బలగాలు జగిత్యాల అటవీ ప్రాంతంలో సోమవారం మోహరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే ఫారెస్ట్ లో ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అది ఒడిస్సా రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉన్నట్టుగా సమాచారం. ఈ బైక్ దొంగలు వినియోగించేందేనా కాదా అన్న వివరాలను సేకరిస్తున్నట్టుగా సమాచారం. దీంతో బలగాలు సమీప అటవీ ప్రాంతంతో పాటు గ్రామాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ముఠా మొంబర్స్ కూడా ఇదే అటవీ ప్రాంతంలో కానీ గ్రామాల్లో కానీ షెల్టర్ తీసుకుని ఉంటారన్న అనుమానంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్టుగా సమాచారం. అయితే పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా ధృవీకరించడం లేదు.

