అక్కడ ఫారెస్ట్ ప్లాజాలు..!

దిశ దశ, హైదరాబాద్:

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP)తో రోడ్లపై టోల్ ప్లాజాలు ఉండడం సహజం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఫారెస్ట్ ప్లాజాల ద్వారా టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. అటవీ ప్రాంతాల్లోని రహదారుల మీదుగా టోల్ వసూళ్లు చేస్తోంది అటవీ శాఖ. గతంలో ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో టోల్ వసూళ్ల విధానం అమల్లో ఉండేది… ఇటీవల గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రత్యేకంగా ప్లాజాలు ఏర్పాటు చేయడం గమనార్హం.

ఇసుక లారీలు…

గోదావరి తీరంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంతాల మీదుగా రవాణా చేస్తున్నారన్న కారణంతో ఇసుక లారీల నుండి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. గోదావరి తీరం మీదుగా వెలుతున్న ఇసుక లారీల ద్వారా ఆధాయాన్ని గడించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడ సాధారణ వాహనాలు కూడా రుసుం చెల్లించాల్సి వస్తోంది. ఆ ప్రాంతం మీదుగా వాహనాలు వెళ్లాయంటే చాలు రూ. 50 ,చొప్పున డబ్బులు కట్ అవుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు శివార్లలో ఒకటి, ప్రాణహిత నది సమీపంలో మరో ప్లాజా ఏర్పాటు చేసిన అటవీ శాఖ వాహనదారుల నుండి ఫారెస్ట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి. ఆన్ లైన్ విధానంతోనే డబ్బులు కట్ అవుతున్నప్పటికీ సాధారణ పౌరులకు మాత్రం ఇది అదనపు భారమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎప్పటిదో…

లక్షెట్టిపేట నుండి జగ్దల్ పూర్ వరకు నిర్మించిన నేషనల్ హైవే దశాబ్దాల క్రితమే పూర్తయినా ఇటీవల కాలంలో ఫారెస్ట్ విభాగం అధికారులు టోల్ ప్లాజాలు ఏర్పాటు చేయడం గమనార్హం. అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ పేరిట వసూలు చేస్తున్నామని బోర్డులను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే టోల్ వసూళ్ల విషయంలో స్థానికులకు కూడా మినహాయింపు ఇవ్వకపోవడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. అయితే ఖానాపూర్ అటవీ ప్రాంతంలో కూడా ఇలాగే టోల్ వసూళ్లు చేయాలని నిర్ణయించగా స్థానిక ఎమ్మెల్యే బోజ్జూ అభ్యంతరాలు తెలపడంతో అక్కడ వసూళ్లను ఆపివేశారు. కానీ చెన్నూరులో మాత్రం ఇన్ ఔట్ కోసం ప్రత్యేకంగా ప్లాజాలు ఏర్పాటు చేయడం గమనార్మం.

పరిహారం..?

జాతీయ రహదారులే అయినా, రాష్ట్ర రహదారులే అయినా ప్రజల అవసరాలే అయినా అటవీ శాఖకు సంబంధించిన భూమి మీదుగా నిర్మాణాలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవల్సి ఉంటుంది. ఇందు కోసం ప్రత్యామ్నాయ భూమిని, అడవుల పెంపకం కోసం నిధులను కెటాయించిన తరువాత కేంద్ర ప్రభుత్వం నుండి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే 1980వ దశాబ్దంలో చెన్నూరు మీదుగా వెలుతున్న హైవేకు అప్పటి ప్రభుత్వం అన్ని రకాల క్లియరెన్స్ లు తీసుకున్న తరువాతే నిర్మాణాలు జరిపింది. జైపూర్, చెన్నూరు మార్గ మధ్యలో కొంతమేర రహదారి అటవీ శాఖ అనుమతి రాకపోవడంతో అక్కడ నేషనల్ హైవే నిర్మించడం కానీ, వంతెనను విస్తరించడం కానీ చేయలేదు. అయినప్పటికీ అటవీ శాఖ మాత్రం బాజాప్తాగా టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి వాహనాల నుండి డబ్బులు వసూలు చేస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. అభయారణ్యాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం తామీ నిర్ణయం తీసుకున్నామని అటవీ శాఖ బోర్డులు ఏర్పాటు చేసింది. అయితే రోడ్డు నిర్మాణం సమయంలోనే ఈ విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే బావుండేది కానీ ఇప్పుడు ప్లాజాలు ఏర్పాటు చేసి ట్యాక్స్ వసూలు చేయడం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. ఓ వైపున నేషనల్ హైవే, స్టేట్ హైవేలను PPP పద్దతిలో నిర్మాణాలు జరిపి వాహనాల నుండి టోల్ వసూళ్లు చేస్తుంటే పారెస్ట్ విభాగం కూడా ప్రత్యేకంగా టోల్ గేట్స్ ఏర్పాటు చేయడం ఏంటో అర్థం కాకుండా పోయింది.