ఈ విషయం ఇక్కడికే పరిమితం చేశారా… ఏఐసీసీ పెద్దలకు ఆలస్యంగా తెలిసిందా..?

సారీ అంటున్న పెద్దాయన…

దిశ దశ, జగిత్యాల:

పీసీసీ చీఫ్ రేసులో ఉన్న నేత… రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్న నాయకుల్లో ఒకరు… కాంగ్రెస్ పార్టీతో 42 ఏళ్ల అనుబంధంతో పలువురు ముఖ్యమంత్రులకు కూడా సన్నిహితుడు… ఏఐసీసీ నేతలకు టచ్ లో ఉండే ఆయన వ్యతిరేకత గురించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చిన్న విషయంగానే భావించిందా..? సుదీర్ఘ రాజకీయ అనుభవం, వ్యవసాయ రంగంతో పాటు తెలంగాణపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న నాయకుని గురించి లైట్ గా తీసుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నదే మిస్టరీగా మారింది.

జాతీయ నేతలకు..?

గత అసెంబ్లీ ఎన్నికల తరువాత సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడంతో జగిత్యాలలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి… జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అన్న పరిస్థితులకు చెక్ పడినట్టయింది. రాష్ట్ర కాంగ్రెస్ తీరుపై కినుక వహించిన జీవన్ రెడ్డి విషయం గురించి మొదట్లో ఏఐసీసీ పెద్దలు జోక్యం చేసుకున్నారు. ఆయను ఢిల్లీకి పిలిపించి మరీ చర్చలు జరిపి శాంతింపజేశారు. అయితే ఆ తరువాత ఆయనకు వ్యతిరేక నిర్ణయాలు జరుగుతుండడం, అనుచరులకు అన్యాయం జరుగుతుండడంతో వ్యతిరేక గళాన్ని మళ్లీ వినిపిచడం మొదలు పెట్టారు. సెకండ్ ఎపిసోడ్ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నప్పటికీ ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దల వరకు చేర్చనట్టుగా తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి వెళ్లడంతో ఆమె జీవన్ రెడ్డికి కాల్ చేసి సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. ఆ తరువాత ఆమె ఏఐసీసీకి జీవన్ రెడ్డి విషయం నివేదించే వరకూ పూర్తి సమాచారం ఢీల్లీ నాయకులకు తెలియలేదని సమాచారం.

సారీ..?

ఢిల్లీతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డితో మంతనాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన ఇప్పుడు సారితో సరిపెడుతున్నట్టుగా సమాచారం. అధిష్టానం నిర్ణయాలను జీవన్ రెడ్డి తప్పు పడుతున్నారని, పార్టీ ఫిరాయించే అవకాశం ఉందని, పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయని ఢిల్లీ నాయకత్వానికి సమాచారం చేరవేసినట్టయితే డ్యామేజీ జరగకుండా జాగ్రత్త పడేందుకు చర్యలు ఉండేవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన పార్టీ ఫిరాయించాలని నిర్ణయించుకోవడం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని అనుచర గణానికి మాట ఇవ్వడం జరిగిపోయిన తరువాత ఏఐసీసీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో తను నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేకుండా పోయిందని జీవన్ రెడ్డి చెప్తున్నట్టుగా సమాచారం. ఈ కారణంగానే కాంగ్రెస్ నాయకులు ఎవరు ఫోన్ చేసినా సారీ అంటూ ఫోన్ కట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని మొదట్లోనే ఢిల్లీకి చేర్చినట్టయితే జీవన్ రెడ్డితో మంతనాలు చేసి అసమ్మతిని సద్దుమణిగేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం అయిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులపై ఏఐసీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారన్న ప్రచారం కూడా స్థానికంగా సాగుతోంది.