రేపు జీవన్ బహిరంగ లేఖ…
దిశ దశ, జగిత్యాల:
కాంగ్రెస్ పార్టీతో నాలుగున్నర దశాబ్దాలకు పైగా ఉన్న అనుబంధానికి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేని పరిస్థితులకు కారణాలేంటీ..? తాను ఇంత కాలం కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఎలా ఉన్నాను..? పొమ్మనలేక పొగబెట్టడం వెనుక అసలేం జరిగింది..? పార్టీ ఫిరాయింపులు తదితర అంశాలపై సమగ్రంగా ఓ లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. శనివారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సముదాయించిన తరువాత ఆయన పునరాలోచన చేసుకుంటారన్న అంచనాలు తలకిందులయ్యాయి. ఆయన మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటానని మంత్రులతో జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు జీవన్ రెడ్డి ఇంటి నుండి వెల్లిపోయిన గంటల వ్యవధిలోనే బహిరంగ లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం బహిరంగ లేఖ ద్వారా తన వైఖరిని వెల్లడించేందుకు రంగం సిద్దం చేసుకున్నట్టుగా సమాచారం.
25న…
ఆదివారం జీవన్ రెడ్డి బహిరంగ లేఖ తరువాత ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేయనున్నారు. అయితే అదే రోజు వేకువ జామున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావులతో పాటు స్థానిక నాయకత్వం జీవన్ రెడ్డి ఇంటికి వెల్లి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించనున్నారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించనున్నారు. అంతేకాకుండా తాను బీఆర్ఎస్ పార్టీలో ఏ రోజు చేరుతారోనన్న విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

