నిర్లక్ష్యం ఎవరిది… పనిష్మెంట్ ఎవరికి..?

ట్యాక్స్ చెల్లించినా బకాయి జాబితాలోనే పేర్లు…

దిశ దశ, కరీంనగర్:

ప్రతి నెలా ఠంచనుగా వాటర్ ట్యాక్స్ చెల్లించే వినియోగదారులు అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు… డబ్బులు చెల్లించినా కూడా కరీంనగర్ బల్దియాలో మాత్రం బకాయిదారులుగానే మిగిలిపోతున్నారు. అయితే నల్లా బిల్లు చెల్లించిన తరువాత మునిసిపాలిటీ నుండి తీసుకునే రశీదులను భద్ర పర్చుకోకపోతే మళ్లీ మీరు డబ్బులు చెల్లించాల్సి వస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోండి. నల్లా కనెక్షన్లు ఇవ్వడం మావంతయితే డబ్బులు చెల్లించడం మీవంతు కదా అనుకునేరు. వాటర్ ట్యాక్స్ చెల్లించిన తరువాత సంబంధిత విభాగంలో అప్ డే్ట్ చేయనట్టయితే మీరు డిఫాల్టర్లుగానే మిగిలిపోతారు జాగ్రత్త.

ఎంత నిర్లక్ష్యం…

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ట్యాబ్ కనెక్షన్ తీసుకున్న వారు ఏటా వాటర్ ట్యాక్స్ కడుతున్నా అప్ డేట్ మాత్రం చేయడం లేదు. పన్నులు చెల్లించాలంటూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నబల్దియా యంత్రాంగం రెగ్యూలర్ గా వాటర్ ట్యాక్స్ కడుతున్న వారి వివరాలను రికార్డ్ చేయడం లేదు. కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్ లలో హౌజ్, వాటర్ ట్యాక్స్ చెల్లిస్తున్న వినియోగదారులకు సంబంధించిన వివరాలను రిజిస్టర్లలో రికార్డ్ చేయకపోవడంతో చాలా మంది డిఫాల్టర్లుగానే మిగిలిపోతున్నారు. ముఖ్యంగా వాటర్ ట్యాక్స్ కు సంబంధించిన వివరాలను పొందుపర్చడంలో మునిసిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది 2004 నుండి వాటర్ ట్యాక్స్ చెల్లించడం లేదని బల్దియా రికార్డుల్లో ఉండగా, వినియోగదారుల వద్ద మాత్రం ఏటేటా ట్యాక్స్ చెల్లించిన రశీదులు ఉన్నాయి. తాము చెల్లించినట్టుగా రశీదులు ఇచ్చిన మునిసిపల్ అధికారులు రికార్డుల్లో మాత్రం ఆ వివరాలను నమోదు చేసుకోకపోవడంతో బకాయిల జాబితాలో తమ పేర్లు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వాటర్ ట్యాక్స్ చెల్లించిన వారు సంబంధిత విభాగానికి వెళ్లి తాము డబ్బులు చెల్లించినట్టుగా రశీదులు చూపించి రిజిస్టర్ లో వివరాలను నమోదు చేయించుకోవల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ట్యాక్సులు వసూలు చేసే విషయంలో అర్భాటంగా ప్రకటనలు చేస్తున్న మునిసిపల్ యంత్రాంగం చెల్లింపుల వివరాలను అప్ డేట్ చేసుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తోందో అంతుచిక్కకుండా పోతోంది.

ఎన్నెన్నో…

బల్దియా పరిధిలోని వేలాది ట్యాబ్ కనెక్షన్లకు సంబంధించిన ట్యాక్స్ కలెక్షన్ వివరాలను పొందుపర్చనట్టుగా తెలుస్తోంది. వినియోగదారుల నుండి పన్నులు వసూలు చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు వివరాలను రికార్డు చేసుకోకపోవడం వెనక అసలు కారణమేంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. ఆన్ లైన్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందని మునిసిపల్ వర్గాలు అంటున్నప్పటికీ ఆప్ లైన్ ద్వారా పేమెంట్స్ తీసుకుంటున్నప్పుడు రిజిస్టర్లలో రికార్డు చేసుకోవల్సిన బాధ్యత కూడా ఉంటుందన్న విషయాన్ని విస్మరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవల నగర వాసి ఒకరు వాటర్ ట్యాక్స్ చెల్లిస్తానని మునిసిపల్ కార్యాలయంలో సంప్రదించగా రూ. 20 వేల వరకూ డ్యూ ఉన్నారని మునిసిపల్ సిబ్బంది చెప్పారు. దీంతో ఖంగుతిన్న సదరు వ్యక్తి తన ఇంట్లో ఉన్న రశీదుల వివరాలను మునిసిపాలిటీలో చూపిస్తే సంబంధిత విభాగంలో అప్ డేట్ చేసుకోండని ఓ ఉచిత సలహా ఇచ్చేశారట. ఏటేటా వాటర్ ట్యాక్స్ చెల్లిస్తున్న ఏండ్లుగా అప్ డేట్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మునిసిపల్ బకాయిలు జాబితాకు, వసూలు చేస్తున్న జాబితాకు పొంతన లేకుండా ఉండడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వసూలు అవుతున్న వాటర్ ట్యాక్స్ వివరాలను అప్ డేట్ చేయకపోవడం వల్ల బకాయిలు వసూలు చేయడంలో విఫలం అవుతున్న మునిసిపాలిటీల జాబితాలో కరీంనగర్ పేరు ప్రముఖంగా వినిపించే అవకాశం ఉంటుంది. దీనివల్ల మునిసిపల్ సిబ్బంది పనితీరు సక్రమంగా లేదని స్పష్టం కానున్నప్పటికీ యంత్రాంగం మాత్రం బకాయిల వసూలైనట్టు రికార్డులు మెయింటెన్ చేయడం లేదు.