ఆ హైవేపై వాహనాలతో పోటీపడుతున్న ఎలుకలు… బొద్దింకలు…

దిశ దశ, నల్గొండ:

ఆ హైవేపై వెలుతున్న వాహనాలతో పోటీ పడుతున్నాయట ఎలుకలు, బొద్దింకలు. అయితే ఈ జీవరాశులు రోడ్డుపై కాకుండా కొన్ని హోటళ్లలో దర్శనమిస్తున్నాయట. ఇవేం ఖర్మ… కుళ్లిపోయిన కూరగాయలు, ముందు రోజు వండిన ఆహార పదార్థాలు ప్రయాణీకుల విందులో చేరిపోతున్నాయట. మంగళవారం ఉదయం 11 గంటల నుండి హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిలోని కొయ్యలగూడెం నుండి కోదాడ మధ్యన ఉన్న పలు హెటళ్లపై తెలంగాణ సేఫ్ ఫుడ్ వింగ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న అధికారులు హోటళ్లలో నెలకొన్న పరిస్థితిని గమనించి ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు నేషనల్ హైవేలోని హోటళ్లలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని ముక్కున వేలేసుకున్న పరిస్థితి తయారైంది.

బొద్దింకలు…

అధికారులు తనిఖీలు నిర్వహించిన పలుహోటళ్లలోని స్టోర్ రూమ్స్ లో ఎలుకలు, బొద్దింకలు తిరుగుతున్నాయని, వంట గది అంతా కూడా అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్నాయని గుర్తించారు. పప్పు, ధాన్యం పురుగులు పట్టి ఉండగా, మాంసాహారం, డైరీ ఉత్పత్తులను సరైన శీతల వాతావరణంలో ఉంచలేదని గమ నించారు. ఒక రోజు ముందే వండిన అన్నం నిలువ ఉండగా, గడువు ముగిసిన FSSAI licence తో hotel నడుపుతున్నట్టుగా గుర్తించారు. కూరగాయలు కూడా కుళ్లిపోయి ఉండడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.

చర్యలు:

అధికారులు చేపట్టిన తనిఖీల్లో లోపాలు బయటపడ్డ హోటళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని హోటళ్లను సీజ్ చేయగా, మరికొన్ని హోటళ్లకు షోకాజ్ నోటీసులు, IMROVEMENT నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు.