భయపెడుతున్న కరీంనగర్…
దిశ దశ, కరీనగర్:
కరీంనగర్ లోని కొన్ని హోటళ్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయ్… ఆదాయం గడించడమే లక్ష్యంగా పెట్టుకున్న నిర్వాహాకులు ఆహార పదార్థాల తయారీలో అనారోగ్యాన్ని పంచే పదార్థాలను కలుపుతున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. ఇటీవల మండే 26లో బిర్యాని తిని పలువురు అస్వస్థకు గురైన తరువాత ఫుడ్ సేఫ్టీ అధికారులు మరో సారి హోటళ్లపై దాడులు చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో సదరు హోటల్ లైసెన్స్ రద్దు చేసినప్పటికీ చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో మీనామేషాలు లెక్కిస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఫుడ్ సేఫ్టీ విభాగం కేవలం లైసెన్స్ సస్పెండ్ చేయడమే కాకుండా బాధ్యులపై కఠినమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని నిబంధనలు చెప్తున్నాయి. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (FSSAI), భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లలో కేసు నమోదు చేయడంతో పాటు భారీ జరిమానా వేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో…
కరీంనగర్ లోని అన్ని రకాల హోటళ్లపై గతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అప్పుడు పలు రకాల లోపాలను గుర్తించిన అధికారులు ఆయా హోటళ్లకు నోటీసులు ఇచ్చారు. కొన్ని హెటళ్లలో అయితే గడువు ముగిసిన వాటిని వినియోగించడం, ఎలుకలు, జిర్ర పురుగులు వంటి జీవులు సంచరించడంతో పాటు ఫ్రిజ్ లలో స్టోర్ చేసిన మాంసం, ఇతర ఆహార పదార్థాలను గుర్తించారు. ఎసెన్స్ కూడా కలుపుతున్నారన్న విషయం కూడా తేల్చారు అధికారులు ఇందుకు కారణమైన ఆయా హోటళ్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. దీంతో కరీంనగర్ హెటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల భయం వెంటాడుతోందని భావించారంతా. కానీ అరేబియన్ మండిలో బిర్యాని తిని పలువురు విద్యార్థులు అస్వస్థకు గురికావడంతో కరీంనగర్ హెటళ్ల నిర్వాహాకులు ఆహారపదార్థాల తయారీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తేటతెల్లం అయింది. దీంతో అప్రమత్తం అయిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా దాడులు చేపట్టారు. వెన్నకు బదులుగా డెలిసియెస్ ఫ్యాట్ స్పెట్ వినియోగిస్తున్నారని, కటింగ్ కోసం ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు వాడుతున్నారని, సింథటిక్ కలర్ ఫుడ్స్ వినియోగిస్తున్నారని గుర్తించారు.
ఆందోళన…
కరీంనగరానికి కేవంల స్థానికులే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా జనం వస్తుంటారు. ఇక్కడి హెటళ్లలో తయారు చేసే ఆహారంలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వంటి ప్రమాదకరమైనవి కలుపుతుండడం వల్ల అవి తిని అనారోగ్యాల బారినే పడే ప్రమాదం ఉంది. ఇష్టారీతిన హోటళ్ల నిర్వాహకులు వినియోగిస్తున్న ప్రమాదకర పదార్థాలను వాడకుండా కఠిన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. ఇందు కోసం తరుచూ దాడులు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని అధికారయంత్రాంగం గమనించాలని పలువురు కోరుతున్నారు.

