కొండగట్టు ఆహ్వానాల తీరుపై చర్చ…

జిల్లా మంత్రికి ఏఈఓ… ఇతర ప్రముఖులకు ఈఓ…

దిశ దశ, జగిత్యాల:

కొండగట్టు అంజన్న ఆలయంలో అత్యంత అరుదైన కార్యక్రమం జరగబోతోంది. ఈ నెల 15 నుండి చందనోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు. ఆరు దశాబ్దాలుగా అంజన్న విగ్రహానికి వేసిన చందనాన్ని తొలగించేందుకు ఐదు రోజులు నిర్వహిస్తారు. ఆ తరువాత 41 రోజుల పాటు నిజరూప దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 20న మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. అత్యంత అరుదైన ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. జీవితంలో ఒక్క సారి మాత్రమే లభించే చందనోత్సవం అనంతరం నిజరూప దర్శనం కార్యక్రమాన్ని కని విని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఆలయ ఈఓ అంజనారెడ్డి, ఏఈఓలు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర అధికార యంత్రాంగాన్ని ఆహ్వానిస్తున్నారు.

జిల్లా మంత్రికి….

సొంత జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఏఈఓ హరిహరనాథ్ చందనోత్సవానికి రావాలని ఆహ్వానించారు. జగిత్యాల జిల్లాకు చెందిన క్యాబినెట్ మంత్రిని ఏఈఓ ఆహ్వానిస్తే రాష్ట్రంలోని ఇతర ప్రముఖులను మాత్రం ఈఓ అంజనా రెడ్డి ఆహ్వానిస్తున్నారు. సాధారణంగా జిల్లా మంత్రికి ఈఓ స్థాయి అధికారి ఆహ్వానం అందించే ఆనవాయితీ ఉంటుంది కానీ కొండగట్టు అంజన్న చందనోత్సవ కార్యక్రమానికి మాత్రం ఏఈఓను పంపించడం సరికొత్త చర్చకు దారి తీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించిన కార్యక్రమంలో కూడా జిల్లా మంత్రి అడ్లూరి లేకపోవడం గమనార్హం. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమం విషయంలో ఈఓ ప్రముఖులను పిలిచే బాధ్యతలు తీసుకున్నప్పటికీ మంత్రి వద్దకు ఏఈఓను పంపడంపై దేవాదాయ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా మంత్రి నేతృత్వంలో నిర్వహించేందుకు ప్రాధాన్యత కల్పించకపోవడం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది.