రెండు హత్యల గుట్టు తేల్చిన వైనం…
దిశ దశ, కరీంనగర్:
ఒంటరిగా ఉన్న వృద్ద మహిళలను చంపి వారిపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లే ముఠాను కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా పకడ్భందీగా స్కెచ్ వేసిన గ్యాంగ్ తీరు గురించి పోలీసులు ఆరా తీయగా విస్తూపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
పోస్టుమార్టం…
తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వచ్చునూరు గ్రామానికి చెందిన ఉప్పులేటి లక్ష్మీ అలియాస్ లచ్చవ్వ (80) అనే వృద్దురాలు అక్టోబర్ 30న చనిపోయింది. ఒంటరిగా ఉంటున్న ఈ వృద్ద మహిళ ఉన్నఫలంగా మరణించడంతో సహజ మరణంగానే భావించారంతా. అయితే లక్ష్మీ ఒంటిపై ఉండాల్సిన ఆభరణాలు అదృశ్యం అయ్యాయి. దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం చేసిన తరువాత డాక్టర్లతో చర్చించినప్పడు తెలిసిన విషయంతో పోలీసుల అనుమానానికి మరింత బలాన్ని చేకూర్చింది. వృద్దురాలు కావడంతో హత్యాప్రయత్నాన్ని నిలువరించేంత శక్తి లేకుండా ఉంటుందని, దీంతో పెనుగులాడినట్టుగా ఆనవాళ్లు లేకపోవడం, ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో నేచురల్ డెత్ గానే భావించారంతా. కానీ అనుమానంతో పోలీసులు ఒక్కో కోణంలో ఆరా తీసి అసలు విషయాన్ని తేల్చేశారు. పోస్టు మార్టం తరువాత వృద్దురాలు హత్యకు గురయి ఉండే అవకాశాలు కూడా 20 శాతం వరకూ ఉన్నాయని డాక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. లక్ష్మీ మరణం మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ఆభరణాలు, డాక్టర్ చెప్పిన 20 శాతం అనుమానాన్ని ఆసరగా చేర్చుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె చనిపోయిన కొద్దిసేపటికి ముందు మొబైల్ కు కాల్ రావడంతో ఆ కాల్ ఆధారంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ హంతకులను గుర్తించారు.
మరో హత్య…
అయితే వచ్చునూరు గ్రామానికి చెందిన ఉప్పులేటి బూదమ్మ (103)ను కూడా ఇదే విధంగా హత్య చేసి ఆభరణాలు ఎత్తుకెళ్లారని కూడా పోలీసుల విచారణలో తేలింది. ఆగస్టు 16వ తేదిన శతాధిక వృద్దురాలిని హత్య చేసిన తరువాత ఆమెది సహజ మరణమని కుటుంబ సభ్యులు భావించి కేసు నమోదు చేయలేదు. తాను వేసుకున్న స్కెచ్ పక్కాగానే వర్కౌట్ అయిందని భావించిన నిందితుడు మరో హత్యకు పాల్పడ్డాడని గుర్తించారు పోలీసులు.
శ్వాస నిలిపి…
ఇద్దరిని కూడా ముక్కు మూసి శ్వాస అందకుండా చేసి చంపినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఒంటరిగా ఉన్న వృద్ద మహిళలను లక్ష్యం చేసుకున్నట్టయితే సహజ మరణంగానే కుటుంబ సభ్యులు భావిస్తారని అంచనా వేసిన నిందితులను పట్టుకోవడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు.
అరెస్ట్…
ఈ కేసులో తిమ్మాపూర్ మండలం వచ్చునూరుకు చెందిన మద్దూరి సాయి (24), పోరండ్లకు చెందిన కిన్నెర రాజు (25), కొత్తపల్లికి చెందిన ఎల్కతుర్తి రాజు (25), వచ్చునూరుకు చెందిన మానుకోల పవన్ కుమార్ అలియాస్ జాక్ (28)లను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన కనపర్తి మణికంఠ (28) ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుల నుండి టీవీఎస్ జూపిటర్, బజాజ్ పల్సర్, కాళ్ల వెండి కడియాలు, ఐదు మొబైల్ ఫోన్లు, ఒక ఇనుప గొట్టం, స్టీల్ పట్టుకార్ లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీకి తీసుకుని నిందితులను విచారించి బూదమ్మ హత్య కేసుతో పాటు ఇంకా ఏమైనా నేరాలకు పాల్పడ్డారా అన్న కోణంలో విచారించనున్నారు.
సీపీ అభినందన…
ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుని హత్యలు చేస్తున్న ముఠాను పట్టుకోవడంలో సఫలం అయిన కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ఎల్ఎండీ సీఐ అనిల్ కుమార్, ఎస్సైలు నరేందర్ రెడ్డి, జగదీష్, అరుణ్ లను సీపీ గౌష్ ఆలం అభినందించారు. ఈ సందర్భంగా పోలీసులకు నగదు రివార్డులు అందజేశారు.

