దిశ దశ, గంగాధర:
సేకరించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోతున్నాయి. గోదాములకు తరలించేందుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండలో కూడా రైతాంగం కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. ధాన్యం రవాణా చేసేందుకు లారీలు కొనుగోలు కేంద్రాలకు చేరకపోవడంతో రైతాంగం ఆగ్రహంతో ఊగిపోతోంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలంలను తీసుకెళ్లి రైతుల ఇబ్బందులను వివరించారు. లారీల కోసం తానే రంగంలోకి దిగితే తప్ప సమస్య పరిష్కారం అయ్యేలా లేదని గమనించారు చొప్పదండి ఎమ్మెల్యే. గంగాధర మండలంలోని మూడు కొనుగోలు కేంద్రాల్లో నిలిచిపోయిన ధాన్యాన్ని తరలించేందుకు సరికొత్త ప్లాన్ వేశారు. లారీలో ప్రయాణించి వాటిని కొనుగోలు కేంద్రాల వైపునకు మళ్లించారు. నిలిచిపోయిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లారీలో ప్రయాణం చేస్తూ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లేందుకు శ్రమించారు. ఆ లారీల్లో ధాన్యాన్ని లోడ్ చేయించే వరకూ అక్కడే కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయారు.

