చదువు కోవాలన్న తపన… ఆర్థిక ఇబ్బందుల వేదన… Btech స్టూడెంట్ అరెస్ట్..!

చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో బీటెక్ స్టూడెంట్…

దిశ దశ, హైదరాబాద్:

సాంకేతిక విద్యలో రాణించాలని కలలుగన్న ఆ యువకుడు కటకటాల పాలయ్యాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అతని చదువుకు ఆటంకంగా మారడంతో అతనికి డబ్బు సంపాదించుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. తనకు బాసటనిచ్చేవారు లేకపోవడంతో చట్ట వ్యతిరేకంగా తక్కువ ధర మద్యాన్ని రవాణా చేసి విక్రయించడం మొదలు పెట్టాడు. చివరకు ఎక్సైజ్ అధికారులకు చిక్కడంతో అరెస్ట్ కాక తప్పలేదు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… మనకాల చరణ్ (22) చండిఘర్ లో బీటెక్ చేస్తున్నాడు. ఆర్థిక సమస్యల్లో కూరుకపోయిన అతని కుటుంబం కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో అతని చదువులకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చే పరిస్థితిలో అతని పేరెంట్స్ లేకుండా పోయారు. తన స్నేహితుల సలహా మేరకు చండీఘర్ లో తక్కువ ధరకు లభ్యమయ్యే బ్రాండెడ్ లిక్కర్ ను హైదరాబాద్ కు రవాణా చేసి విక్రయించడం మొదలు పెట్టాడు చరణ్. వారానికి 7 నుండి 10 వరకు శివాజ్ రీగల్, జానీ వాకర్ వంటి కాస్ట్లీ లిక్కర్ చండీఘర్ నుండి హైదరాబాద్ కు తీసుకవచ్చి విక్రయించి తన చదువుకు అవసరమైన డబ్బు సంపాదించుకుంటున్నాడు. అయితే నిబంధనలకు విరుద్దంగా లిక్కర్ అక్రమ రవాణా చేస్తున్నాడన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ డీటీఎఫ్ బృందం చరణ్ ను అదుపులోకి తీసుకుంది. అతని వద్ద రూ. 50 వేల విలువ చేసే శివాజ్ రీగల్, జానీవాకర్ బ్రాండ్లకు సంబంధించిన 15 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. YMCA ప్రాంతంలో చరణ్ ను పట్టుకున్నామని డీటీఎఫ్ సీఐ సౌజన్య మీడియాకు తెలిపారు. నిందితుడిని, మద్యం బాటిళ్లను నారాయణగూడ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్టు ఏఈఎస్ శ్రీనవాస రావు వెల్లడించారు.