కరీంనగర్ ఘటన పాల్గొన్న గ్యాంగ్ వృత్తి…
దిశ దశ, కరీంనగర్:
కేరాఫ్ అడ్రస్ ఉన్నా… అటు వైపు కన్నెత్తి చూసే రకాలు కాదు వారు… పిల్లా పాపలతో పాటు పెట్టే బేడా, మూట ముల్లే సర్దుకుని సిద్దంగా ఉంటారు వారి కుటుంబ సభ్యులు. సేఫ్టీ జోన్ అనుకున్న చోట నాలుగు రోజులు ఉండడం ఎవరికీ అనుమానం రాకుండా జీవించడం కొద్ది రోజుల తరువాత అక్కడి నుండి వేరే చోటకు తరలిపోవడం… మగ వాళ్లు మాత్రం దేశం నలుమూలాల తిరుగుతూ దోపిడీలకు పాల్పడడం. ఇది కరీంనగర్ పీఎంజె జ్యూవెలరీ షోరూంలో దోపిడీకి పాల్పడిన ముఠాల జీవన విధానం. కరీంనగర్ లో రాబరీ చేసిన తరువాత వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు తెలుస్తున్న సంచలన విషయాలు వింటే ఔరా అని ఆశ్యర్యపోవల్సిందే. స్వగ్రామం ఉన్నప్పటికీ అటు వైపు వెళ్లడానికి దొంగలే కాదు వారి భార్యా పిల్లలు కూడా మొగ్గు చూపరని తెలుస్తోంది. దోపిడీలకు పాల్పడడం ఆ తరువాత ఆ ప్రాంతంతో సంబంధం లేని చోటకు వెళ్లడం ఈ ముఠా తీసుకునే జాగ్రత్తల్లో అత్యంత ముఖ్యమైనది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన భారీ దోపిడీలతో కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీ దుకాణంలో నగలు ఎత్తుకెళ్లిన ముఠాకు సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారించినట్టుగా తెలుస్తోంది. దక్షిణాదిన దోపిడీకి పాల్పడిన వీరు స్వస్థలాలకు వెళ్లకుండా మరో ప్రాంతంలో దోపిడీ చేసేందుకు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. సుబోది గ్యాంగ్ సభ్యులయి ఉంటారని అనుమానిస్తున్న ఈ ముఠా భారీ దోపిడీలకు పాల్పడడం అత్యంత చాకచక్యంగా తప్పించుకోవడంలో పర్ ఫెక్ట్ స్కెచ్ వేసుకుంటారని సమాచారం.
మూడు రోజుల్లో…
ప్రధానంగా ఈ గ్యాంగ్ నెట్ వర్క్ కూడా అదే స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. దోపిడీ చేసిన విలువైన ఆభరణాలను వేరే మార్గాల గుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తారని, అక్కడ ఉన్న తమకు సంబంధించిన వారికి చేరేవిధంగా ప్లాన్ చేసుకుంటారని తెలుస్తోంది. అక్కడి వారు వాటిని విక్రయించి డబ్బులను వారి కుటుంబాలకు చేర్చుతారని సమాచారం. దేశంలోని వివిధ రాష్ట్రాలలోని ముఠాలు పరస్పర సహాకారం అందిచుకుంటూ దోపిడీలకు పాల్పడుతుంటారని సమాచారం. చాలా వరకూ కూడా పోలీసులకు చిక్కుకుండా తప్పించుకునే ఈ గ్యాంగ్ ను పట్టుకోవాలంటే పోలీసులకు దేశ వ్యాప్తంగా గాలించాల్సిందే తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితేనని తెలిసింది. దోచుకెళ్లిన ఆభరణాలను మూడు రోజుల్లో నగదుగా మార్చుకునే విధంగా పథకం రచించుకునే కార్యరంగంలోకి దిగుతారని తెలిసింది.
గంటల వ్యవధిలోనే…
రెండు రోజుల పాటు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయ లక్ష్మీ లాడ్జిలో అడ్డా వేసిన రాబరీ గ్యాంగ్ పీఎంజే జ్యూవెలరీ షోరూం లక్ష్యంగా స్కెచ్ వేసింది. బైకులపై ముందుగా వీరు కరీంనగర్ కు చేరుకుని షోరూం పరిసర ప్రాంతాలపై అవగాహన చేసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఈ నెల 1వ తేదిన వీరు కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీ సమీపంలోని ఓ టీ స్టాల్ లో టీ తాగినట్టుగా సిసి కెమెరాల్లో రికార్డయింది. ఈ లెక్కన వీరు రెండు రోజుల ముందే రెక్కి నిర్వహించి పకడ్భందీగా ప్లాన్ అమలు చేశారు. నిమిషాల వ్యవధిలో రూ. 2 కోట్ల విలువ చేసే నగదును ఎత్తుకెళ్లిన ఈ ముఠా గంటల వ్యవధిలోనే సరిహద్దులు దాటేసినట్టుగా తెలుస్తోంది. వచ్చిన దారినే తిరిగి ధర్మపురి చేరుకున్న ముఠా అక్కడే ఒక బైక్ పడేసి మరో బైక్ రూట్ మార్చేసి పొరుగునే ఉన్న మంచిర్యాల జిల్లా మీదుగా మహారాష్ట్రలోకి వెళ్లిపోయారని సమాచారం. 11.12 గంటలకు కరీంనగర్ జ్యూవెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడి పరార్ అయిన వీరు మద్యాహ్నం ఒంటి గంట నుండి 2 గంటల మధ్యలో జిల్లా సరిహధ్దులు దాటారని అంచనా వేస్తున్నారు.

