అధిష్టానం పట్టించుకోకపోవడానికి కారణం..?
దిశ దశ, హైదరాబాద్:
భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయాలతో దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో అసోం,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను కైవసం చేసుకున్న తీరు బిజెపి విజయ పరంపరకు అడ్డే లేదన్నట్టయింది. అయితే దక్షిణాదిన తెలంగాణ లాంటి రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలనుకుంటున్న కమలనాధుల ప్రయత్నాలు
ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి.
శాసనసభలో 8 లోకసభలో మరో ఎనిమిది స్థానాలను రాష్ట్రం నుంచి దక్కించుకొని మంచి ఫలితాలనే అందిపుచ్చుకున్న బిజెపి నుండి అదే దూకుడు కనిపించడం లేదు. రాష్ట్రంలో బలం పుంజుకుంటున్న ప్రతి సందర్భంలోనూ అంతే స్థాయిలో వర్గపోరు మొదలు కావడం బిజెపి జాతీయ నాయకత్వాన్ని విస్మయానికి గురి చేస్తోంది. వంద కోట్ల హిందువులలో జాతీయ భావాన్నిపెంపోదిస్తూ కేంద్రంలో వరుసగా మూడవసారి అధికారాన్ని దక్కించుకుని దేశంలో కాంగ్రెస్ సుదీర్ఘ పాలనకు చెక్ పెట్టిన బిజెపి తెలంగాణలో సొంత పార్టీలో నెలకొన్న విబేధాలు మాత్రం పరిష్కరించుకోలేకపోతోంది. ఉత్తరాది రాష్ట్రాలపై వ్యూహాత్మక ఎత్తులతో పట్టు బిగించినా, సాధ్యం కాదనుకున్న పశ్చిమ బెంగాల్ లో దీదీని గద్దె దింపడంలో విజయవంతం అయిన బీజేపీ అధిష్టానం తెలంగాణ విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలు, ఎత్తుగడలు కలిసి రాకపోవడానికి సొంత నేతలే కారణమవుతున్నప్పటికీ పార్టీ కేంద్ర నాయకత్వం వీటిని గాడిన పెట్టడంలో ఎందుకో విఫలం అయినట్టే కనిపిస్తోంది. తెలంగాణాలో గద్దెనెక్కడమే తమ లక్ష్యమని పదే పదే ప్రకటనలు చేస్తున్న బీజేపీ అగ్రనేతలు సొంత ఇంట్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలను నిలువరించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు..? గతంలో ఎన్నడూ లేని విధంగా లోకసభలో, శాసనసభలో ప్రాతినిథ్యం దక్కించుకున్నా పార్టీని బలోపేతం దిశగా పావులు కదపలేని పరిస్థితి తయారు కావడానికి కారణమేంటీ..? ఇప్పుడివే ప్రశ్రలు ప్రతి బిజెపి కార్యకర్త మదిలో మెదులుతున్నాయి.
ముఖ్య నేతలే…
తెలంగాణ నుండి చట్ట సభలకు ఎన్నికైన నాయకుల మధ్య సయోధ్య లేకుండా పోయిందన్నది బహిరంగ రహస్యం. ముఖ్యంగా రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలలో విబేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయా నేతలు బాహాటంగా ప్రకటనలు చేసుకోనప్పటికీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం వారి మధ్య నెలకొన్న విబేధాల తీవ్రతకు అద్దం పడుతోంది.
అప్పటి నుండే…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన బండి సంజయ్ కుమార్ ను జాతీయ నాయకత్వం ఆ పదవి నుండి తప్పించినప్పటి నుండి రాష్ట్ర నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న విబేధాలు రచ్చకెక్కడం మొదలైంది. బండి సంజయ్ ని అధ్యక్ష స్థానం నుండి ఎందుకు తప్పించాల్సి వచ్చింది అన్న విషయాలపై మీడియాకు లీకులు ఇచ్చింది పార్టీ నాయకులే కాగా, ఆయనపై కొంతమంది ఏకంగా అధిష్టానానికి అనేక ఫిర్యాదులు చేశారన్న అభిప్రాయం సంజయ్ అనుచరుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలోనే సంజయ్ రెండో సారి ఎంపీగా గెలుపొందడం, ఆపై అనూహ్యంగా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవడంతో పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలకు చెక్ పడుతుందని భావించినా చాపకింద నీరులా అసమ్మతి కొనసాగుతూనే వస్తోంది. ఇటీవల కాలంలో బండి సంజయ్ కుమారుని కేసు విషయంతో మరోసారి ఎంపీల మధ్య నెలకొన్న అభిప్రాయబేధాలు బట్టబయలయ్యాయి. సంజయ్ ని అ ప్రతిష్ట పాలు చేసేందుకే ఈ అంశాన్ని సొంత పార్టీ నేతలే రచ్చ రచ్చ చేశారని సంజయ్ వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ విషయంలో తన ప్రమేయం కూడా ఉందని ప్రచారం జరుగుతోందని వచ్చిన వార్తలను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కొట్టి పారేశారు. మల్కాజిగిరీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా బండి కుమారుని విషయంలో ఆయనను ఆ ప్రతిష్ట పాలు చేసేందుకు తనవంతు పాత్ర పోషించారన్న చర్చ కూడా సంజయ్ వర్గంలో పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఈ విషయంపై అధిష్టానం త్రిమేన్ కమిటీ వేసి నివేదికలు తెప్పించుకుని వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. మూడో విడత కేంద్రంలో బిజెపి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో పార్టీ జాతీయ కమిటీలోనూ, మంత్రివర్గంలోనూ మార్పులు ఉంటాయని వార్తలు వస్తున్న క్రమంలోనే ఎంపీ ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు ప్రత్యక్ష్యం కావడం, ఈ విషయంలో కేసు నమోదు చేసి పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అనుచరుడని సోషల్ మీడియా వేదికల్లో ట్రోల్ చేశారు. ఇదే క్రమంలో సదరు నాయకుడు ఈటల రాజేందర్ తో దిగిన ఫోటోలను వైరల్ చేసి కౌంటర్ అటాక్ చేసింది ఆయన ప్రత్యర్థి వర్గం. ఇంతకాలం స్తబ్దంగా ఉన్న నాయకులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ అటాక్ చేసుకుంటుండడంతో ఎంపీల మధ్య నెలకొన్న విబేధాలు తెలంగాణ సమాజంలో చర్చకు దారి తీస్తున్నాయి. ఇదే సమయంలో బండి సంజయ్ ఐదారు రోజుల పాటు అనారోగ్యంతో ఇంటికే పరిమితం కాగా ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కాంగ్రెస్ పాలన వ్యవహారాలు, బీఆర్ఎస్ అంతర్గత కలహాల నడుమ తెలంగాణ రాజకీయాలలో శూన్యత ఉన్న క్రమంలో బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను బిజెపి అంతర్గత కుమ్ములాటలతో చేజేతులా నాశనం చేసుకుంటుదనే భావన
ఇటు పార్టీ అటు సంఘ్ పరివార్ నేతలు, కార్యకర్తలు నుండి
వ్యక్తం అవుతోంది.
అధిష్టానం..?
ఇంత జరుగుతున్న జాతీయ నాయకత్వం వెయిట్ అండ్ సీ అన్న ధోరణీలోనే ఉండడం పార్టీ వీరాభిమానులను విస్మయపరుస్తోంది. రాష్ట్రంలో విబేధాల జబ్చుకు చికిత్స చేసినట్టయితే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందని పార్టీ విధేయుల నమ్మకం. కానీ బీజేపీ ముఖ్య నేతలు మాత్రం ఆదిశగా పావులు కదుపుతున్నట్టుగా కనిపించడం లేదన్న వాదనలు తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏకఛత్రాదిఫత్యం చెలాయిస్తున్న కమలం పార్టీ తెలంగాణ విషయానికొచ్చేసరికి అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడం వెనక ఆంతర్యం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది.

