సిరొంచలో సోషల్ క్లబ్స్ కేంద్రంగా దందా…
దిశ దశ, దండకారణ్యం:
మహారాష్ట్రలో సోషల్, స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేస్తే తెలంగాణాలో ప్రచారం చేయడమెందుకు..? ఆ రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల్లో కూడా నిర్వహిస్తున్న సోషల్ క్లబ్స్ నడుస్తున్నా… ఓ మారుమూల తాలుకా కేంద్రంలోని క్లబ్బుల గురించి ఈ స్థాయిలో క్యాంపెయిన్ నిర్వహించడానికి కారణమేంటీ..? నిబంధనల ప్రకారం అంతా సవ్యంగా జరుగుతున్నదని అక్కడి అధికారయంత్రాంగం చెప్తున్నా వ్యాపార ధోరణీ అవలంభించడం వెనక అసలేం జరుగుతోంది..?
వాట్సప్ గ్రూపులు…
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా కేంద్రంగా నడుస్తున్న రెండు క్లబ్బుల్లో అసలేం జరుగుతోంది..? రిక్రియేషన్ క్లబ్ నిబంధనల మేరకే అక్కడ సోషల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయా..? లేక చట్ట విరుద్దమైన ఆటలు ఆడుతున్నారా..? అంతా సవ్యంగా సాగినట్టయితే ఆ రెండు క్లబ్బుల గురించి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడమెందుకున్నదే మిస్టరీగా మారింది. ఇందు కోసం వాట్సప్ గ్రూప్ లను క్రియేట్ చేసి మరీ ఈ రోజు క్లబ్ నడుస్తోంది… ఫంటర్స్, డ్రైవర్స్ గమనించాలని, తాను అందుబాటులో ఉంటానని వచ్చి తనను కలవాలని వాట్సప్ గ్రూపుల్లో సూచనలు చేయడం ఎందుకు..? జూదం నిర్వహించేందుకే సోషల్, స్పోర్ట్స్ పేరిట క్లబ్స్ ఏర్పాటు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఫంటర్స్ కు ఎర…
సిరొంచ తాలుకా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ రెండు క్లబ్బులకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన జూదగాళ్లు వెలుతున్నారు. పేకాటపై మక్కువ ఉన్న వారంతా సిరొంచకు చేరుకుంటున్నారని తెలుస్తోంది. వీరి కోసం వెహికిల్స్ కూడా క్లబ్బుల నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారంటే ఇక్కడ జూదం ఏ స్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. కోట్ల రూపాయల మేర టర్నోవర్ అవుతోందని, ఇక్కడకు వచ్చే ఫంటర్స్ కోసం తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ప్రైవేట్ లాడ్జ్ లు కూడా బుక్ చేసి సకల వసతులు కల్పిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
గతంలో…
అయితే గతంలో కూడా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జూదం నిర్వహిస్తున్న సమాచారం అందుకున్ని ఫంటర్స్ పెద్ద సంఖ్యలో క్యూ కట్టేవారు. ఈ సమాచారం అందుకున్న పోలీసు అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో తెలంగాణ ప్రాంతం నుండి జూదం ఆడేందుకు మహారాష్ట్ర వైపు వెల్లేందుకు జంకేవారు. ఇప్పుడు మాత్రం ఎవరూ పట్టించుకోకపోవడంతో వందల సంఖ్యలో తెలంగాణాకు చెందిన వాహనాలు సిరొంచకు వెల్తున్నాయి.