దిశ దశ, సిరొంచ:
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా రామంజపురంలో నిర్వహిస్తున్న సోషల్ క్లబ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి, ఏసీబీ డీజీ కార్యాలయానికి ఫిర్యాదు వెల్లింది. సోషల్ క్లబ్ పేరిట అనుమతులు తీసుకుని అక్రమంగా జూదం నిర్వహిస్తున్న విషయంపై సమగ్ర విచారణ జరపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంకు చెందిన జర్నలిస్ట్ రేవెల్లె నాగరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం సీఎం కార్యాలయానికి, ఏసీబీ కార్యాలయానికి మెయిల్ ద్వారా కంప్లైంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సోషల్ క్లబ్ నిర్వాహకులు విస్తృతంగా ప్రచారం చేశారని, ఆయా ప్రాంతాలకు చెందిన పేకాట ఆడేవారిని సిరొంచకు తరలిస్తున్నారని వెల్లడించారు. టాక్సీ ఓనర్లు, డ్రైవర్లకు కూడా బోనస్ లు ప్రకటించి పేకాట ఆడేవారిని సిరొంచకు తరలించేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారని వివరించారు. అంతేకాకుండా సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న గడ్చిరోలి జిల్లాలో మద్యం వినియోగం కూడా పెరిగిపోయిందని దీంతో ప్రభుత్వ లక్ష్యానికి గండిపడుతోందని నాగరాజు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆకస్మిక దాడులు చేసినట్టయితే రామంజపూర్ లోని క్లబ్ లో అసలేం జరుగుతుందో స్పష్టంగా తెలుస్తుందని కూడా వివరించారు. అధికారులను కూడా ప్రభావితం చేస్తున్నామని క్లబ్ నిర్వాహకులు బాహాటంగానే చెప్పుకుంటున్నారన్నారు. సోషల్ క్లబ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం విధించిన నిబంధనలు ఏమిటీ..? ఇందుకు అనుగుణంగా రామంజపూర్ లోని రీగల్ మనోరంజన్ క్లబ్ లో సౌకర్యాలు ఏర్పాటు చేశారా లేదా అన్న విషయంపై ఆరా తీయాలని అభ్యర్థించారు. ఇటీవల ఈ క్లబ్ లో గొడవ కూడా చోటు చేసుకుందని, ఈ క్లబ్ కు చేరుకునే వాహనాలను సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్ తో పాటు సమీప ప్రాంతాల్లో పార్కింగ్ చేయిస్తున్నారన్నారు. ఫంక్షన్ హాల్ తో పాటు, సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్ ఎవరు సమకూర్చారు, క్లబ్ తరలించే టాక్సీ డ్రైవర్లు, ఓనర్లకు ఇస్తున్న కమిషన్లకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు మీ దృష్టికి వస్తాయని నాగరాజు వివరించారు. ఎన్ఓసీలతో పాటు ఇతరాత్ర ధృవీకరణ పత్రాలన్నింటిని పరిశీలించాలని కోరారు.
స్పందన…
సిరొంచ తాలుకాలోని సోషల్ క్లబ్ పై మహారాష్ట్ర సీఓఎంకు మెయిల్ ద్వారా పంపిన వెంటనే స్పందన వచ్చింది. ఈ ఫిర్యాదును హోంశాఖకు పంపిస్తున్నామని నాగరాజుకు మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చారు. అలాగే ఏసీబీ కార్యాలయానికి అందిన ఫిర్యాదును నాగపూర్ ఎస్పీ కార్యాలయానికి పంపించినట్టుగా కూడా సమాచారం అందించారు.