బల్దియా అధికారులు దృష్టి సారించలేదా..?
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ డంపింగ్ యార్డులో పేరుకపోయిన చెత్త శుద్ది కార్యక్రమంలో చిత్త శుద్ది లేకుండా పోయిందా..? బిల్లులు డ్రా చేసే విషయంలో బల్దియా అధికారులు వెనకా ముుందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నారా..? కాంట్రాక్టు ఏజెన్సీ ఇష్టారీతిన చెప్పిన లెక్కలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారా అంటే అవుననే అనిపిస్తున్నాయి. సదరు ఏజెన్సీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుకు… బల్దియాలో డ్రా చేసిన బిల్లుకు ఏ మాత్రం పొంతన లేకుండా పోవడం విశేషం. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో డంపింగ్ యార్డ్ చెత్త బయో మైనింగ్ చేసే కాంట్రాక్టర్ ఓ ఫిర్యాదు చేశారు. తన ఏజెన్సీకి విన్వే ఇన్ఫ్రాటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు వినయ్ రెడ్డి మోసం చేశాడని అతనికి అడ్వాన్సుగా డబ్బులు చెల్లించి మిషన్ అద్దెకు తీసుకున్నానని జానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు జాన్ సైదా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్పొరేషన్ ద్వారా తనకు చెత్త బయో మైనింగ్ కోసం 30 వేల టన్నుల ఆర్డర్ వచ్చిందని, ఇందు కోసం విన్వే ఇన్ఫ్రాటిక్ నిర్వాహాకుల వద్ద మిషననరీ లీజుకు తీసుకున్నానని వివరించారు. అయితే సదరు సంస్థ నిర్వాహకుడు మిషనరీ తనదేనని చెప్పి అద్దెకు ఇచ్చాడని, అలాగే ఒప్పందం ప్రకారం కూడా మిషన్ పని చేయలేదని వెల్లడించారు. అయితే జనవరి 24 2026న పని ప్రారంభించిన ప్రాసెసింగ్ మిషన్ మార్చి 7 2026 వరకు వర్క్ చేసిందని, అగ్రిమెంట్ ప్రకారం 340 గంటల పాటు పని చేయాల్సి ఉండగా కేవవలం 156 గంటలు మాాత్రమే పని చేసిందని కాంట్రాక్టు నిర్వాహాకుడు జాన్ సైదా ఆ ఫిర్యాదులో వివరించారు. దీనివల్ల తాను సకాలంలో పనిచేయలేకపోయానని సదరు సంస్థ నిర్వాహకుడు వినయ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇందుకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు క్రైం నంబర్ 171/2026, ఏప్రిల్ 4 2026న క్రిమినల్ కేసు నమోదు చేశారు. సెక్షన్ 318 (4), 351(2)BNSలలో వినయ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
అదెలా..?
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కరీంనగర్ బల్దియాతో ఒప్పందం చేసుకున్న జానేశ్వర్ ఇంజనీరింగ్ సంస్థ నిర్వాహాకుడు జాన్ సైదా రూ. 526కు టన్ను చొప్పున 30 వేల టన్నుల చెత్తను బయో మైనింగ్ చేస్తానని ఒప్పుకున్నారు. ఇందుకు అనుగుణంగానే పనులు చేపట్టానని వెల్లడించిన జాన్ సైదాకు ఇప్పటికే రూ. 40 లక్షల వరకు బిల్లులు ఇవ్వగా మరో రూ. 30 లక్షల వరకు బిల్లులు తయారు చేశారని, ఇందుకు సంబంధించిన ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిందని తెలుస్తోంది. మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు జాన్ సైదాకు ఇచ్చిన బిల్లుకు, ఆయన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలకు ఏ మాత్రం పొంతన లేకుండా పోయిందని స్పష్టం అవుతోంది. కేవలం 156 గంటల పని చేస్తే రూ. 70 లక్షల వరకూ బిల్లులు చెల్లించడానికి కారణమేంటన్నది అంతు చిక్కకుండా పోతోంది. టెరెక్స్ 1 పవర్ స్క్రీన్ మోడల్ వారియర్ 1200 మిషన్ గంటకు ఎక్కువలో ఎక్కువ 25 టన్నుల చెత్తను బయె మైనింగ్ చేస్తోందని తెలుస్తోంది. ఈ లెక్కన 156 గంటలకు ఎంత చెత్తను శుద్ది చేసిందో అర్థం చేసుకోవచ్చు. కానీ బల్దియా అధికారులు మాత్రం అడ్డగోలుగా బిల్లులు డ్రా చేసేందుకు ఫైళ్లు మూవ్ చేయడం విచిత్రంగా ఉంది. మరోవైపున ఈ సంస్థకకు అప్పగించిన సైట్ వద్ద వే బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో సంస్థ నిర్వాహకులు ఎంత మేర బయో మైనింగ్ చేశామని లెక్కలు రాస్తే అంతకు బిల్లులు చేశారా..? సైట్ ఇంఛార్జిగా వ్యవహరించిన బల్దియా సిబ్బంది కూడా కళ్లు మూసుకున్నారా అన్న విషయం అంతు చిక్కకుండా పోతోంది. మరో వైపున టెరెక్స్ 1200 మిషనరీ రీడింగ్ వివరాలు, దాని సామర్ధ్యం గురించి టెక్నికల్ గా తెలుసుకోకుండానే అధికారులు బిల్లులు ఎలా సిద్దం చేశారోనన్నదే మిస్టరీగా మారింది.
ఛీటింగ్ ఎవరైనట్టు..?
తన కాంట్రాక్టు పని కోసం తీసుకున్న మిషనరీ అద్దెకు ఇచ్చిన నిర్వాహకుడు వినయ్ రెడ్డి మోసం చేశాడని జాన్ సైదా ఇచ్చిన ఫిర్యాదు తప్పా..? మునిసిపల్ అధికారులకు తప్పుడు లెక్కలు చూపించి అడ్డగోలు బిల్లులు డ్రా చేసుకున్న జాన్ సైదా తప్పుడు రికార్డులు చూపించారా అన్నది తేల్చాల్సిన అవవసరం ఉంది. ఒకవేళ నిజంగానే 156 గంటలు మాత్రమే మిషన్ ద్వారా బయోమైనింగ్ చేసినట్టయితే అంతకన్నా ఎక్కువ బిల్లు డ్రా చేసినందుకు జానేశ్వర ఇంజనీరింగ్ సంస్థపై బల్దియా అధికారులు ఛీటింగ్ కేసు నమోదు చేయడంతో పాటు అదనంగా ఇచ్చిన బిల్లులను రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. మునిసిపల్ నుండి డ్రా చేసుకున్న బిల్లుల మేరకే వర్క్ చేసినట్టయితే వన్ టౌన్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారన్న కారణంతో జాన్ సైదాపై చట్టాన్ని దుర్వినియోగం చేశారన్న కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. రెండు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండదన్న ధీమాతో జాన్ సైదా తప్పుడు ఫిర్యాదులు చేశారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే 156 గంటలు మాత్రమే పని చేసినట్టయితే అదనంగా బిల్లులు మంజూరు చేసిన బల్దియా యంత్రాంగంపై కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.