శాతవాహనలో వర్గాలు… ప్రొఫెసర్ల మధ్య అభిప్రాయ బేధాలు…

సమిధలవుతున్న విద్యార్థులు

దిశ దశ, కరీంనగర్:

విశ్వ విద్యాలయంలో సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు జరిగితే… అక్కడ మాత్రం వర్గాల మధ్య ఆరాటం సాగుతోంది. ఆదిపత్య పోరాటమో  లేక అంతర్గతంగా నెలకొన్న విబేధాలో అంతుచిక్కడం లేదు కానీ రోజు రోజుకి అక్కడి కుమ్ములాటలు రచ్చకెక్కుతున్నాయి. వైస్ ఛాన్సలర్లపైనా  ఆరోపణలు పర్వం కొనసాగుతోందంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడకు వచ్చే వీసీలను కొంతమంది మచ్చిక చేసుకోవడం వల్ల ఈ పరిస్థితి తయారవుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి.

శాతవాహన కేంద్రంగా…

కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీ కేంద్రంగా సాగుతున్న వర్గ విబేధాలు విద్యా వ్యవస్థను కలవరపరుస్తున్నాయి. సాధారణంగా యూనివర్శిటీలో నెలకొన్న సమస్యలపై పోరాటాలు చేయడం, తమ పట్టును నిలుపుకునేందుకు శ్రమించడం విద్యార్థి సంఘాల వంతయితే… కరీంనగర్ శాతవాహనలో మాత్రం సంబంధం లేని అంశాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్న పరిస్థితి తయారైంది. ప్రొపెసర్లు కూడా విద్యార్థులను విభజిస్తూ వర్గాలను ప్రొత్సహిస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. విలువలతో కూడిన విద్యనందించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన వేదికగా ఉండాల్సిన విశ్వవిద్యాలయంలో ఏదో ఒక సంచలన విషయం వెలుగులోకి వస్తున్న తీరు ఆందోళన కల్గిస్తోంది.

ఫిర్యాదుల పరంపర…

శాతవాహన వైస్ ఛాన్సలర్లపై ఆరోపణలు రావడం సాధరణామే అన్నట్టుగా తయారైంది. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న వీసీపైనా  ఫిర్యాదులు, ఆరోపణలు వస్తుండడం గమనార్హం. కేంద్ర మంత్రి బండి సంజయ్, జిల్లా కలెక్టర్, సీపీ, ఎస్సీ ఎస్టీ కమిషన్ లకు ఫిర్యాదులు చేసుకునే వరకూ చేరుకున్నాయి ఇక్కడి పరిస్థితులు. నిషేధిత విద్యార్థి సంఘాల పేరిట అర్బన్ నక్సల్స్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని కొంతమంది విద్యార్థులు ఆరోపిస్తుంటే… తప్పుడు ప్రచారం చేస్తూ తమపై నిందలు వేస్తున్నారని అంటున్నారు మరికొంత మంది విద్యార్థులు. అర్బన్ నక్సల్స్ ఉన్నారంటూ చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవమని, క్లాస్ రూంల నుండి విద్యార్థులను బలవంతంగా తీసుకెళ్లి నిరసనలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వీసీకి ఫిర్యాదు చేశారు. అయితే మరో వైపున తనవైపు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సోషియాలజీ ప్రొఫెసర్ సూరపల్లి సుజాత ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా శాతవాహన వీసీలపై ఆరోపణల పర్వం కొనసాగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా వీసీపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అసలు విశ్వవిద్యాలయం కేంద్రంగా సాగుతున్నదేంటీ..? ఇక్కడ పని చేసే వీసీలే చుట్టే విమర్శలు సాగడానికి కారణమేంటన్న విషయంపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తరుచూ శాతవాహన అంశం తెరపైకి వస్తున్నతీరుపై దృష్టి సారించి ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. విద్యాబోధనపై దృష్టి సారించాల్సిన ప్రొఫెసర్లు విద్యార్థులను దారి మళ్లీస్తున్నారన్న ఆరోపణలపైనా ఆరా తీయాల్సిన అవసరమూ ఉంది.  యూనివర్శిటీలో నెలకొన్న పరిణామాలపై కఠినంగా వ్యవహరించనట్టయితే శాతవాహన విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకునే ప్రమాదమూ లేకపోలేదు.

karimnagarSatavahana CampusSatavahana Universitytelangana newsTG NEWS
Comments (0)
Add Comment