దిశ దశ, భూపాలపల్లి:
పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్దరణ ఇప్పట్లో అసాధ్యంగానే కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో నిపుణులను రంగంలోకి దింపినప్పటికీ బ్యారేజ్ వద్ద నీటిని నిలువ చేయడం కష్టతరమేనని అనిపిస్తోంది. పలు రకాల పరీక్షలు నిర్వహిస్తే తప్ప మేడిగడ్డను వినియోగంలోకి తీసుకొచ్చే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ఆటంకం…
మేడిగడ్డ వద్ద Central Water & Power Reserch Station Pune (CWPRS) నిపుణులు వివిధ రకాల పరీక్షలు చేస్తున్నారు. గత ఫిబ్రవరి రెండో వారం నుండి మేడిగడ్డ వద్ద బోర్లు వేసే పనిలో కూడా నిమగ్న అయ్యారు. ఒక్క మేడిగడ్డ వద్దే 504 బోర్లు వేసి వివిధ రకాల పరీక్షలు నిర్వహించాల్సిన అవశ్యకత ఉందని నిపుణులు తేల్చినట్టుగా సమాచారం. అయితే ఇఫ్పటి వరకు ఆరు బోర్లు వేయడం పూర్తయిందని మిగతా బోర్లు వేయాల్సి ఉందని సమాచారం. అయితే ఇక్కడ పరీక్షలు నిర్వహించేందుకు బ్యారేజ్ దిగువ భాగంలో నీటి ప్రవాహ ఉధృతి తీవ్రంగా ఉండడం ఆటంకంగా మారినట్టుగా తెలుస్తోంది. మరో వైపున ఇక్కడకు వస్తున్న నీటిని ఎత్తిపోసేందుకు ప్రత్యేకంగా మోటార్లు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతోందని సమాచారం. వీరు ఈఆర్టీ ఎనాలిసిస్, జియో ఫిజికల్ టెస్టులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
చేయాల్సిన పరీక్షలివే…
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 14 రకాల పరీక్షలు చేయాల్సి ఉందని తెలుస్తోంది. జియో టెక్నికల్ విభాగంలో బోర్ హోల్స్ డ్రిల్లింగ్ చేసి రాఫ్ట్ తో పాటు కింది భాగంలో వేసిన కాంక్రీట్ పరిస్థితి..? దిగువన ఉన్న మట్టి గురించి అంచనా వేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ (SPT) ద్వారా భూమి డెన్సిటీ గురించి, స్ట్రాటిగ్రఫీ ద్వారా భూమి పొరలు ఎలా ఉన్నాయి అన్న విషయాలపై అధ్యయనం చేయాల్సి ఉంది. జియో ఫిజికల్ విభాగంలో ఎలక్ట్రికల్ రెసెస్టివిటీ టోమోగ్రఫీ ద్వారా రాఫ్ట్ లోపలి భాగంలో ఎలా ఉంది, గ్రౌండ్ పెనెట్రేటింగ్ ద్వారా రాడర్ రేడియో తరంగాల విధానంతో సూక్ష్మ లోపాలను గుర్తించాల్సి ఉంటుంది. సిస్మిక్ రిఫ్రాక్షన్ టెస్ట్ ద్వారా శబ్దాలను ఏ స్థాయిలో గ్రహిస్తున్నాయోనన్న విషయంపై స్ఫష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ విభాగంలో అల్ట్రా సోనిక్ పల్స్ విలాసిటీ (ULV) ద్వారా పిల్లర్ లోపల ఎలా ఉంది..? కాంక్రీట్ మధ్య గ్యాప్ ఉందా అన్న విషయాలపై అవగాహన చేసుకోనున్నారు. రీ బౌండ్ హ్యామర్ టెస్ట్ పిల్లర్ సామర్థ్యం ఎలా ఉందో గుర్తించనుండగా, కోర్ రికవరీ టెస్ట్ ద్వారా కాంక్రీట్ క్రషింగ్ టెస్ట్ చేయాల్సి ఉంది. హైడ్రాలిక్ స్టడీస్ విభాగంలో స్కౌర్ అనాలిసిస్… రాఫ్ట్ దిగువన ఇసుక ఎంత మేర కొట్టుకపోతోంది… వరద ఉధృతి ఎంత మేర ఉంది అన్నది తెలియనుంది. అప్ లిఫ్ట్ ప్రెజర్ మానిటరింగ్ ద్వారా రాఫ్ట్ మీదుగా ప్రవహిస్తున్న వరద ఏ స్థాయిలో ప్రభావితం చేయనుంది అన్న విషయం తెలుసుకునేందుకు ఫీజో మెట్రిక్ లెవల్ పరిశీలించాల్సి ఉంది. పైపింగ్ పొటెన్షియల్ అనాలిసిస్ ద్వారా రాఫ్ట్ దిగువన ఉన్న ఇసుక ఎంతమేర కొట్టుకపోతోందోనన్న విషయంపై స్ఫష్టత రానుంది. స్ట్రక్చరల్ హెల్త్ అనాలిసిస్ విభాగంలో సెటిల్ మెంట్ మానిటరింగ్ చేయాల్సి ఉంటుందని పిల్లర్లు కుంగిపోయిన 2023 అక్టోబర్ 21న ఎంత లోతుకు చేరుకున్నాయి… ప్రస్తుతం ఎంత లోతునకు పిల్లర్లు చేరుకున్నాయి అన్న వివరాలను తెలుసుకోనున్నారు. పిల్లర్లు డిస్ట్రెస్ ఎంత మేర అయిందన్న విషయంపై ఎనాలిసిస్ చేయాల్సి ఉంది. మొదటి రోజున 1.129 మీటర్ల మేర పిల్లర్ డిస్ట్రెస్ కాగా, ప్రస్తుతం 1.203 మీటర్లకు చేరుకుందని సమాచారం. టిల్ట్ మీటర్ల్ ద్వారా డిస్ట్రెస్ కు గురైన పిల్లర్లు ఇరు ఓ పక్కకు వంగిపోతున్నాయా లేదా అన్న విషయంపై స్పష్టత రానుంది. వంతెన బరువును తట్టుకుంటున్నాయా లేదా అన్న విషయంపై కూడా అంచనా వేయనున్నారు. అయితే ఇప్పటి వరకు 19, 20 పిల్లర్లు ఓ పక్కకు ఒరిగిపోయాయని సమాచారం. దీనిపై కూడా సమగ్రంగా పరీక్షలు నిర్వహించి పరిష్కారం చూడాల్సి ఉంది. పరీక్షల అనంతరం రెట్రో ఫిట్టింగ్ డాటా వస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ, సీడబ్లుసీ, సీడీఓ, ఆఫ్రే సంస్థలు ఫర్ ఫ్యాబ్రికేషన్స్ అండ్ కన్సట్రక్షన్స్ (FFC) ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తరువాత మేడిగడ్డ మరమ్మత్తులకు శ్రీకారం చుట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది.