జగిత్యాల నాయకులు సీఎంను కలవాల్సి ఉంది…
దిశ దశ, మంథని:
జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారా…? బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారంటూ స్పీకర్ ఇచ్చిన తీర్పుకు భిన్నంగా పార్టీ ఫిరాయించారా..? అంటే అవుననే అంటున్నాయి రాష్ట్ర మంత్రి కామెంట్స్. బీఆర్ఎస్ పార్టీ బీఫారంపై గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ళ శ్రీపాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం మంథనిలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి నెలకొన్న విషయాన్ని ప్రస్తావించారు జర్నలిస్టులు. దీనిపై స్పష్టతనిచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే కు కూడా ఈ విషయం తెలుసని ఆయనతో తాను కూడా మాట్లాడిన తరువాతే జగిత్యాల నాయకులను సీఎం వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించామని మంత్రి వివరించారు. అయితే సీఎం కూడా జగిత్యాలకు చెందిన 50 మందికి పైగా నాయకులకు సమయం ఇస్తానని మాట ఇచ్చారని అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రోగ్రాం వాయిదా పడిందని అడ్లూరి లక్ష్మణ్ కుమర్ వెల్లడించారు. జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి మాత్రం లేదని, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సీఎంను కలిపించాలని మాత్రమే కోరారని వివరించారు. మంత్రి అడ్లూరి వెంట ట్రేడింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, కరీంనగర్ సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు శశిభూషన్ కాచెతో పాటు పలువురు నాయకులు కూడా ఉన్నారు.