టోల్ వసూళ్లు సరే… సూచనల బోర్డుల మాటేమిటో..?

 

ప్రయాణీకుల అవస్థలు పట్టించుకునే వారేరీ..?

దిశ దశ, హుజురాబాద్:

వరంగల్, కరీంనగర్ హైవే పూర్తి కావడంతో టోల్ వసూళ్లు చేస్తున్నప్పటికీ ప్రయాణీకులకు అవసరమైన సూచనల బోర్డులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేషనల్ హైవైతో రాకపోకలకు అనువుగా మారిందని సంబరపడుతున్నప్పటికీ సైన్ బోర్డుల ఏర్పాటు చేయకపోవడం ఇబ్బందికరంగా మారింది. జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఈ రోడ్డు జగిత్యాల వరకు నిర్మించాల్సి ఉన్నప్పటి మొదటి విడత మాత్రం కరీంనగర్ వరకు పూర్తయింది. దాదాపు 68 కిలోమీటర్ల మేర పూర్తయిన ఈ రోడ్డుపై ప్రయాణీకుల నుండి టోల్ ప్లాజా వద్ద పూర్తి స్థాయిలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

సైన్ బోర్డులు…

ప్రధానంగా ఈ రహదారి కరీంనగర్ సమీపంలోని దుర్శేడు గ్రామ శివార్ల వరకు పూర్తయింది. జగిత్యాల వైపునకు వెల్లే రహదారి నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో అక్కడ అడ్డు గోడ నిర్మించి డైవర్షన్ తీసుకోవాలని సూచన ఏర్పాటు చేశారు. అయితే వరంగల్, కరీంనగర్ మీదుగా జగిత్యాల, నిజామాబాద్, కొండగట్టు తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు నేరుగా దుర్శేడు శివార్లలోకి చేరుకుని కరీంనగర్ పట్టణంలోకి ఎంటర్ కావల్సిన పరిస్థితి ఏర్పడింది. మానకొండూరు వద్ద కరీంనగర్ వైపునకు వెల్లే ఎగ్జిట్ అని సైన్ బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ మానకొండూరుకు వెళ్లే మార్గమంటూ సూచనలు ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా ఇదే ప్రాంతంలో కొండగట్టు, జగిత్యాల వైపునకు నేరుగా వెళ్లాలంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. కేవలం కరీంనగర్ సమీపం వరకే పూర్తయినప్పటికీ సూచిక బోర్డులు మాత్రం నేరుగా వెళ్లాలని సూచిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మానకొండూర్ ఎగ్జిట్ వద్దే రోడ్డు నిర్మాణం నిలిచిపోయిందని, జగిత్యాల, నిజామాబాద్ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు దారి మళ్లించుకోవాలని సూచించాల్సిన అవసరం ఉంది. కానీ నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఈ దిశగా చొరవ తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మరో వైపున కరీంనగర్ నుండి పరకాలకు వెళ్లే వాహనదారులకు ఎగ్జిట్ వద్ద సూచన బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పరకాల వైపునకు వెల్లే మార్గమని సూచిస్తూ ఏర్పాటు చేసిన బోర్డు అదృశ్యం కావడంతో చాలా మంది ప్రయాణీకులు నేరుగా వరంగల్ వైపునకు వెల్తున్నారు. దీంతో అదనంగా 40 నుండి 50 కిలో మీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల కూడా వరంగల్, ఖమ్మం రహదారి అని సూచిస్తూ సైన్ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఫలనా ప్రధాన రహదారి ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉందన్న సూచనలు కనిపించడం లేదు. ముందస్తుగా ఇలాంటి సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్టయితే వాహనదారులు అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. నేషనల్ హైవే పై టోల్ వసూలు చేయడం ఆరంభించే నాటికే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. కానీ అధికారులు ఆ దిశగా చొరవ తీసుకోకపోవడం ఇబ్బందికరంగా మారింది. కొత్తగట్టు వద్ద టోల్ ప్లాజా ఏర్పాటు చేసినప్పటికీ స్థానికుల కోసం సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల ఇక్కట్టు తప్పడం లేదని స్థానికులు ఆందోళన చేశారు. దీంతో అధికారులు జోక్యం చేసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో నిమగ్నం అయ్యారు.

karimnagarLatest NewsNational Highway 563Toll collectionwarangal high way
Comments (0)
Add Comment