దిశ దశ, హుజురాబాద్:
దళిత బంధు ద్వారా లబ్ది పొందడమే వారికి శాపంగా మారిందా… నిబంధనల కారణంగా అర్హులైన వారికి పెన్షన్లు అందడం గగనంగా మారిందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దళిత బంధు స్కీం ద్వారా అప్పటి ప్రభుత్వం రూ. 10 లక్షల వరకూ ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. ఏదైనీ ప్రభుత్వ పథకం ద్వారా లబ్ది పొందిన వారికి ఐదేళ్ల వరకూ మరో స్కీంలో అర్హులుగా చేర్చ వద్దన్న నిబంధనలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు పొందేందుకు దళిత బంధు లబ్దిదారుల కుటుంబాలు అనర్హులన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీనివల్ల తమకు భరోసా లేకుండా పోయిందని దళిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సింహ భాగం…
దళిత బంధు పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ కేంద్రంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలోని దళితులందరికీ రూ 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఈ పథకం అమలు చేసినప్పటికీ ఎక్కువ మంది లబ్దిదారులు మాత్రం హుజురాబాద్ లోనే ఉన్నాయి.
పెన్షన్లు…
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి మహిళలకు, వితంతువులకు పెన్షన్లు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అలాగే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రూ. 5 లక్షల సాయం చేస్తోంది. అయితే దళిత బంధు స్కీం ద్వారా లబ్ది పొందిన వారికి పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు కెటాయించే అవకాశం లేదని తెలుస్తోంది. అర్హులైన వారు ఉన్నప్పటికీ నిబంధనల కారణంగా ఎంపిక చేయడం లేదని సమాచారం. అధికారులు మాత్రం వీరి జాబితాను హోల్డ్ లో పెట్టామని చెప్తున్నారు. వీరి విషయంలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవల్సి ఉందని చెప్తున్నారు. పెన్షన్లకు సంబంధించిన సమావేశాలకు హాజరవుతున్న దళిత మహిళలు తమకు అర్హత ఉన్నప్పటికీ దళిత బంధు స్కీంలో లబ్ది పొందడం వల్ల కొత్తగా ఎంపిక చేస్తున్న లబ్దిదారులకు లాభం చేకూరే అవకాశం లేదని తెలిసి నిరాశపడుతున్నారు. అన్ని రకాలుగా అర్హత ఉన్నప్పటికీ తమకు పెన్షన్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ ఎప్పుడో…
పెన్షన్ స్కీంలో లబ్దిదారులను ఎంపిక చేసే విధానం చాలా కాలం తరువాత అమలవుతోందని… మళ్లీ కొత్త జాబితా తయారు చేయాలంటే మరికొన్ని ఏళ్లు వేచి ఉండక తప్పదని అంటున్నారు. ఈ ప్రక్రియ నిరంతరంగా సాగినట్టయితే ఐదేళ్ల గడువు ముగిసిన తరువాత తమకు లబ్ది చేకూరుతుంది కానీ మళ్లీ ఎన్నాళ్లకు కొత్తవారికి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుందో తెలియదని దీనివల్ల అర్హత ఉన్నప్పటికీ తమకు అన్యాయం జరుగుతోందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.