ఎస్సై శ్రీకాంత్ పై ఎఫ్ఐఆర్
దిశ దశ, వరంగల్:
లోయర్ మానేరు డ్యాం ఎస్సైగా పని చేస్తున్నప్పుడు సస్పెన్షన్ కు గురయ్యారా పోలీసు అధికారి. అనతి కాలంలోనే సస్పెన్షన్ ఎత్తివేసిన అధికారులు తిరిగి కరీంనగర్ కమిషనరేట్ కు అలాట్ చేశారు. ఆ తరువాత ఆయన జమ్మికుంట ఎస్సైగా విధుల్లో చేరారు. అక్కడ చేరిన రోజుల వ్యవధిలోనే ఆయనపై వరంగల్ కమిషనరేట్ లో క్రిమినల్ కేసు నమోదయింది. ఒంటరి మహిళను అత్యాచారం చేసినట్టుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పుడలా…
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లోయర్ మానేరు డ్యాం (LMD) ఎస్సైగా పని చేస్తున్నప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు కదిర శ్రీకాంత్. పలుమార్లు అధికారుల నుండి హెచ్చరికలు అందుకుని చివరకి జనవరి 7న అటాచ్డ్ పోస్టింగ్ అందుకున్నాడు. ఆ తరువాత అతన్ని సస్పెన్షన్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు నెలల్లోనే శ్రీకాంత్ సస్సెన్షన్ ఎత్తివేయడంతో పాటు తిరిగి అతన్ని కరీంనగర్ కమిషనరేట్ కే పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. ఇటీవలే జమ్మికుంట ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఆయనపై ఏకంగా ఎఫ్ఐఆర్ జారీ కావడం పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది.
దుమారం…
LMD ఎస్సైగా పనిచేస్తున్న శ్రీకాంత్ సస్పెన్షన్ గురైన తరువాత కరీంనగర్ లో దుమారం లేచినంత పనైందనే చెప్పాలి. కమిషనరేట్ లో పనిచేస్తున్న పలువురు పోలీస్ అధికారులపై అధికార పార్టీ నాయకులకు పెద్ద ఎత్తున సమాచారం చేరింది. దీంతో కరీంనగర్ కమిషనరేట్ లో ఏదో జరుగబోతోందన్న చర్చ కూడా జరిగింది. ఇదే సమయంలో కరీంనగర్ సీపీ గౌష్ ఆలం సెలవుపై వెళ్లడంతో ఎస్సై సస్సెన్షన్ కారణమంటూ కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఒక దశలో ఓ ఎస్సై విషయంలో సీపీ కరీంనగర్ నుండి బదిలీ అవుతారన్న వాదనలు కూడా వినిపించాయి. సెలవు ముగియడంతో సీపీ తిరిగి కరీంనగర్ లో జాయిన్ కావడంతో అప్పుడు జరిగిదంతా తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది.
జమ్మికుంటలో…
సస్పెన్షన్ నుండి జమ్మికుంట ఎస్సైగా విధుల్లో చేరిన శ్రీకాంత్ పై సుబేదారి పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదు కావడం గమనార్హం. సోషల్ మీడియా వేదికగా పరిచయం అయిన ఒంటరి మహిళను ట్రాప్ చేసి ఏడాది కాలంగా వేదింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట ఫేస్‌బుక్‌లో బాధితురాలికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె యాక్సెప్ట్ చేసిన తరువాత హాయ్ అనే మెసేజ్ చేయడంతో ఆమె ఎవరని ప్రశ్నించడంతో తాను ఇల్లంతకుంట ఎస్సైనని పరిచయం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమె గురించి వివరాలు తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ గత సంవత్సరం మే 19న ఆమెను కలిసినట్టుగా వివరించారు. అప్పటి నుండి ఆమెను బెదిరింపులకు గురి చేస్తున్నాడని, ఓ సారి హన్మకొండ రింగ్ రోడ్డు సమీపంలోని, మరోసారి బోడుప్పల్ లోని ఓ లాడ్జిలో బలాత్కారం చేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. సస్పెన్షన్ కు గురైన తరువాత ఆమెను మరింత ఎక్కువగా వేదింపులకు గురి చేశాడని, ఇదే సమయంలో డబ్బు అవసరమని చెప్పి తీసుకున్నాడని, జమ్మికుంటలో జాయిన్ అయిన తరువాత తన డబ్బులు తిరిగి ఇవ్వాలంటే ఇచ్చాడని వివరించారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు తన వద్ద ఉన్నాయని తన విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. ఆ తరువాత కూడా ఆమె వల్ల తన బిడ్డ ఆరోగ్యం బాగా లేదని కూడా ఆమెను హింసించాడని ఎన్నో రకాలుగా బాధలు భరించలేకపోయిన తాను పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని బాధితురాలు పోలీసులకు చెప్పుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఎస్సై కదిర శ్రీకాంత్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు సుబేదారి పోలీసులు.
లీవులో…
అయితే జమ్మికుంటలో పని చేస్తున్న ఎస్సై శ్రీకాంత్ రెండు రోజుల పాటు సెలవుపై వెల్లినప్పుడే సుబేదారి పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు అయింది. ఈ విషయం వెలుగులోకి రాగానే ఆయన డ్యూటీకి రావడం మానేసినట్టుగా తెలుస్తోంది. మరో వైపున బాధితురాలిని ఒప్పించేందుకు ఎస్సై తన కుటుంబ సభ్యులను రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. బాధితురాలిచే కాంప్రమైజ్ చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అత్యాచారం సెక్షన్లలో నమోదయిన ఈ కేసు రాజీ కావడం అసాధ్యమేనని తెలుస్తోంది.