అంతర్మథనంలో జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకులు…

దిశ దశ, జగిత్యాల:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయితే తమ బాధలు చెప్పుకునే అవకాశం ఉంటుందని ఆశించారు వారంతా. చివరకు తమలోని భావాలను చెప్పుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చిందన్న వేదన వ్యక్తం చేస్తున్నారు.  సీఎంను కలిసే ముందే కండిషన్ పెట్టడంతో ఒకటి అరా విషయాలు ప్రస్తావించడంతోనే సరిపెట్టాల్సి వచ్చిందని అంటున్నారు. ఎన్నో ఆశలతో సీఎం వద్దకు చేరుకున్న తాము వినడానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది తప్ప చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని అంతర్మథనానికి లోనవుతున్నారు.

సీనియర్ కాంగ్రెస్…

మంగళవారం జగిత్యాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న తమకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని, సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికే అవకాశాలు దక్కినట్టయితే తాము అన్యాయానికి గురవుతామని సీఎంకు చెప్పుకోవాలని కలలు కన్నారు. అయితే హైదరాబాద్ చేరుకున్న తరువాత ముఖ్యమంత్రితో జాగ్రత్తగా మాట్లాడాలని, ఎమ్మెల్యేపై ఎలాంటి ఆరోపణలు చేయకూడదన్న కండిషన్ పెట్టడంతో జగిత్యాల నాయకులు ఒక్కసారిగా నీరుగారిపోయారు. మరో వైపున సీఎంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా భేటీకి హాజరు కావడంతో తమ మనసులోని వేదనను బయటకు రానీయకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి లాభం లేకుండా పోయిందనే వాదన జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తం అవుతోంది.

నామినేటెడ్ పదవులు…

తాము 40 ఏళ్లకు పైగా పార్టీలోనే కొనసాగుతున్నామని తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని కొంతమంది నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరక్టర్లుగా తమకు అవకాశం ఇవ్వాలని కోరగా సీఎం ఇందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితులు, తమపై వివక్ష చూపే ప్రమాదం ఉందన్న విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని భావించిన జగిత్యాల కాంగ్రెస్ నాయకులకు మాత్రం నిరాశే ఎదురయినట్టుగా సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే సమావేశానికి హాజరు కావడం ఒకటైతే… ఎలాంటి ఫిర్యాదుల చేయకూడదన్న కండిషన్ విధించడం మరో కారణం అయిందని జగిత్యాల సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు. ఏది ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం కూడా జగిత్యాల సీనియర్ నాయకుల సమస్యను సున్నితంగా పరిష్కరించుకున్నట్టుగా అయింది. కానీ భవిష్యత్తులో వారికి ప్రాధాన్యత లేకుండా పోయినట్టయితే మాత్రం వ్యతిరేకతను మూటగట్టుకోవల్సి వస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గమనించాల్సిన అవసరం ఉంది.

cm revanth reddyCongressJAGITIAL NEWSPoliticsTG NEWS
Comments (0)
Add Comment