మొలంగూరు ఖిల్లాపై గుప్త నిధుల వేట…

చారిత్రాత్మక కట్టడాల ఉనికికే సవాల్…

దిశ దశ, హుజురాబాద్:

కాకతీయుల కాలం నాటి కట్టడాలల్లో చెప్పుకోదగిన కట్టడం మొలంగూర్ ఖిల్లా ఒకటి. 13వ శతాబ్దంలో కాకతీయుల రాజు ప్రతాపరుద్రుని పరిపాలన సమయంలో ఇక్కడ ఖిల్లాను నిర్మించారు. ఎత్తైన గుట్టలపై కాకతీయ సామ్రజ్యానికి సైన్యాధికారి అలిగిరి మహారాజ్ నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆ సమయంలోనే ఈ గుట్టలపై నిర్మించిన శివాలయం నేటికీ ఉంది. ముస్లీం సూఫీ మలాంగ్ షా వలీ దర్గా కూడా ఉంది. అంతేకాకుండా ఆరోగ్యాన్ని అందించే నీటికి ప్రసిద్ది అయిన దూద్ బావి కూడా ఈ ఖిల్లా సమీపంలోనే ఉంది. అయితే కాకతీయ రాజులు ఖిలా వరంగల్ నుండి ఎలగందల్ కు రాకపోకలు సాగించేప్పుడు ఈ కోటను సెద తీరేందుకు ఉపయోగించుకునే వారని తెలుస్తోంది. రాజుల కాలంలో టంకాశాలకు సంబంధించిన సైన్యం ఆయా ప్రాంతాల్లో అప్పడు చెలామణిలో ఉన్న నగదుతో పాటు విలువైన ఆభరణాలను వెంట తీసుకెళ్లేవారు. ఈ క్రమంలో వాటిని దాచి పెట్టేందుకు సహజ సిద్దంగా ఉన్న గుట్టలను తొలవడమో లేక భూ గర్భంలో ఉంచేవారు. టంకశాలకు సంబంధించిన సైన్యం నిధులు దాచి పెట్టిన ప్రాంతంలో ప్రత్యేకంగా కోడ్ ఏర్పాటు చేసుకునేవారు. రాజులు ఆ ప్రాంతం మీదుగా పర్యటించినప్పుడు వాటిని వినియోగించుకునే విధంగా అందుబాటులో ఉంచే వారని పరిశోధకులు చెప్తున్నారు. ఇదే పద్దతిలో మొలంగూర్ ఖిల్లాపై కూడా అప్పటి సైన్యం రహస్యంగా నిధులు దాచి పెట్టి ఉంటుందన్న అనుమానంతో స్థానికులతో చేతులు కలిపిన కొంతమంది గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. గతంలో మొలంగూర్ ఖిల్లాపై గుప్త నిధుల కోసం తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగేవి. తాజాగా ఈ నెల 24వ తేది అర్థరాత్రి మొలంగూర్ ఖిల్లా పరిసర ప్రాంతంలో గుప్త నిధుల కోసం ముఠా సంచరించిందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానికులు ఖిల్లా పరిసర ప్రాంతాల్లో సంచరించగా తవ్వకాలు జరిపినట్టుగా గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శనివారం పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరక్టర్ రవితేజ, కేశవపట్నం ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి, మొలంగూర్ సర్పంచ్ పూదరి రాజులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఖిల్లా పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ఖిల్లాపై కూడా పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అలనాటి చరిత్ర ఆనవాళ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.

గుర్తులు…

అగంతకులు మొలంగూర్ ఖిల్లా పరిసర ప్రాంతంలో గుంత తవ్విన చోట బండ రాయికి పామును పోలిన విధంగా చెక్కి ఉంది. దీంతో అప్పటి సైన్యం ఈ ప్రాంతంలో నిధులు దాచి పెట్టి గుర్తుగా సమీపంలోని బండరాళ్లపై పామును చెక్కి ఉంటారన్న అనుమానంతో గోతిని తీశారని అంచనా వేస్తున్నారు. గతంలో సైన్యం బండ గర్తులు ఏర్పర్చుకునే వారని మొలంగూర్ ఖిల్లాపై పాము ఆకారంలో చెక్కి ఉంటారన్న అనుమానంతో సమీపంలో తవ్వకాలు జరిపినట్టుగా స్పష్టం అవుతోంది. అయితే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ముఠా ఎవరన్నది తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నం అయినట్టుగా సమాచారం.

ArchaeologyHidden TreasuresKakatiyaKakatiya DynastyMolangur Fort
Comments (0)
Add Comment