అన్నారం ఇసుక రవాణా తీరు…
దిశ దశ, భూపాలపల్లి:
మేటలు వేసిన ఇసుక తొలగించాలని నిపుణులు సూచించారు… ఇసుక తొలగించేందుకు సర్కారు ఆదేశించింది… టీజీఎండీసీ కాంట్రాక్టు అప్పగించింది… ఇదంతా బాగానే ఉన్న అక్కడ ఇసుక రవాణా విషయంలో నిబంధనలు పాటిస్తున్నారా..? ఇతర రీచుల విషయంలో అమలు చేస్తున్న నిబంధనలు అక్కడ ఎందుకు పాటించడం లేదు..?
అన్నారం…
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వద్ద ఇసుక రవాణా విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. బ్యారేజ్ సమీపంలో భారీగా పేరుకపోయిన ఇసుక మేటల వల్ల పరీక్షలు నిర్వహించడం ఇబ్బందిగా మారిందని పూణేకు చెందిన నిపుణులు ఇరిగేషన్ అధికారులకు వెల్లడించారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు చేయగానే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. TGMDC టెండర్లకు పిలిచి కాంట్రాక్టులు అప్పగించింది. అయితే కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు నడుచుకుంటున్నారా లేదా అన్న విషయంపై దృష్టి పెట్టే పరిస్థితి లేకుండా పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ బ్యారేజే ఎగువ ప్రాంతం నుండి సేకరిస్తున్న ఇసుకను గోదావరి నదిలోనే డంప్ చేస్తున్నారు. అక్కడే రెండు మూడు మిషనరీల ద్వారా లోడింగ్ చేస్తున్నారు. ఇందుకోసం గోదావరి నదిలోకి లారీలు వచ్చి పోయేందుకు కెనాల్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా ఓ రోడ్డునే నిర్మించారు. ఇదే కెనాల్ మీదుగా ఇసుక లోడ్ చేసిన లారీలకు కూడా అనుమతించడం గమనార్హం. అన్నారం బ్యారేజ్ మీదుగా మంచిర్యాల జిల్లాకు వాహనాలు వెల్లేందుకు వేరే రహదారి ఉన్నందున ఆ రోడ్డును వినియోగించకండా గ్రావిటీ కెనాల్ రోడ్డునే గత కొన్నేళ్లుగా ఇసుక లారీల రాకపోకలకు అనుమతిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గోదావరి నది నుండి ఇసుకను సాధారణ రహదారి సమీపంలోకి నిబంధనల ప్రకారం రవాణా చేయాల్సిన వాహనాలతో తరలించినట్టయితే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గ్రావిటీ కెనాల్…
అన్నారం బ్యారేజీకి గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు డిజైన్ చేశారు. కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి పంప్ హౌజ్ నుండి నేరుగా అన్నారం బ్యారేజీకి చేరుకునే విధంగా గ్రావిటీ కెనాల్ నిర్మాణం జరిపారు. అయితే ఇప్పుడు అదే గ్రావిటీ కెనాల్ రోడ్డు ఇసుక రవాణాకు అత్యంత కీలకంగా మారిపోయింది. ఇక్కడ రోడ్డు నిర్మాణం పటిష్టంగా ఉందన్న కారణంతో ఇసుక రవాణా చేస్తున్న లారీలకు అనుమతి ఇచ్చినట్టుగా స్పష్టం అవుతోంది. ఇరిగేషన్ నిబంధనల ప్రకారం కేవలం వ్యవసాయ అవసరాలకు, ఇంజనీర్లు పర్యవేక్షించేందుకు లైట్ మోటారు వాహనాలను అనుమతించాల్సి ఉంటుందని తెలుస్తోంది. భారీ వాహనాలను ఈ ప్రాంతం మీదుగా తరలించేందు అనుమతి ఇవ్వరాదని తెలుస్తోంది. ఇసుక తరలించేందుకు లారీలను నిరంతరం అనుమతించడం వల్ల రానున్న కాలంలో కెనాల్ రోడ్డు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని, దీని ప్రభావం కెనాల్స్ పై పడే ప్రమాదం కూడా ఉంటుందన్న విషయాన్ని విస్మరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ విభాగం నిర్వహణలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్స్ పై భారీ వాహనాలను అనుమతించడం నేరంగా పరిగణిస్తారు. అదే విభాగం పర్యవేక్షణలో ఉన్న కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ విషయంలో మాత్రం మినహాయింపు ఇస్తున్నారు.
స్టాక్ యార్డ్…
అన్నారం పరిసర ప్రాంతాల్లోని భూములు చాలా వరకూ ఇరిగేషన్ అధికారులు సేకరణ జరిపారని దీంతో సమీపంలో స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసే పరిస్థితి లేకుండా పోయిందన్న ప్రచారం ఇటీవల కాలంలో మొదలు పెట్టారు. ఇరిగేషన్ అవసరాల కోసమే పేరుకపోయిన ఇసుకను తొలగిస్తున్నందును ఆ శాఖ పరిధిలో ఉన్న మిగులు భూములను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. ఇతర ఇసుక రీచుల మాదిరిగానే ఇక్కడ కూడా పట్టా భూములను కానీ ఇరిగేషన్ భూములను కానీ స్టాక్ యార్డు కోసం లీజుకు తీసుకునే అవకాశం ఉన్నా సమీపంలో భూములు లేవన్న కారణం చూపించి చేతులు దులుపుకుంటున్నారు. ఒక వేళ ఇరిగేషన్ విభాగం భూములు స్టాక్ యార్డు కోసం తీసుకున్నా టీజీఎండీసీ నిబంధనల ప్రకారం లీజు చెల్లించవచ్చన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. సమీపంలో కాకున్న కొద్ది దూరంలో అయినా పట్టా భూములు ఉన్నప్పటికీ వాటిని లీజుకు తీసుకోకుండా గోదావరి నదిలోనే స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసుకోవడం వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ స్థానికంగా సాగుతోంది.