క్రిమినల్ కేసు నమోదు…
సీపీ గౌష్ ఆలం సీరియస్…
దిశ దశ, కరీంనగర్:
మరణించిన పోలీసు సిబ్బంది ఐడీలను ఆధారం చేసుకుని వేరే వ్యక్తుల పేరిట అకౌంట్లు ఓపెన్ చేశాడో ఘనుడు. వారి పేరిట జీతాలు డ్రా చేసేందుకు నకిలీ డాక్యూమెంట్లతో బ్యాంకు అకౌంట్లు కూడా తీసి దర్జాగా సొమ్ము కాజేశాడు. ఈ విషయం అధికారుల దృష్టికి చేరగానే సమగ్రంగా దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం బాధ్యునిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే…
కమిషనరేట్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలోని పే సెక్షన్ లో గతంలో పని చేసిన ఓ ఉద్యోగి తన చాకచక్యాన్ని ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. మరణించిన ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్ల ఎంప్లాయి ఐడీల ఆధారంగా IFMIS పోర్టల్ లో వారి స్థానంలో వేరే వారి పేర్లను అప్ లోడ్ చేశాడు. వీరి పేరిట ప్రైవేటు బ్యాంకులో ఖాతాలను కూడా ఓపెన్ చేసిన సదరు ఉద్యోగి తన మొబైల్ నంబర్ ను మూడు అకౌంట్లకు అనుసంధానం చేశాడు. 2022 నుండి 2026 వరకు ముగ్గురు కానిస్టేబుళ్ల పేరిట వేతనాలు ప్రతి నెల డ్రా చేసుకుంటూ తన అవసరాలకు వాడుకుంటున్నాడు. నాలుగేళ్లలో మొత్తం రూ. కోటి 40 లక్షల 18 వేల 308 డబ్బులను మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్లకు జీతాలను తన అవసరాలకు వినియోగించుకున్నట్టుగా విచారణలో తేలింది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ విచారణ జరిపి వాస్తవాలను గుర్తించడంతో కేసు నమోదు చేయాలని వన్ టౌన్ సీఐ రామచందర్ రావును సీపీ గౌష్ ఆలం ఆదేశించారు. ఈ కేసులో ఎంతమంది ప్రమేయం ఉందో తెలుసుకునే పనిలో నిమగ్నం అయ్యారు పోలీసులు.