దిశ దశ, వీణవంక:
వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి ఇసుక క్వారీల్లో లోడింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. గ్రామంలో రెండు రీచులు ఏర్పాటయ్యాయి. మొదట ఒక రీచ్ నుండి ఇసుక విక్రయాలు సాగుతుండగా తాజాగా మరో రీచును కూడా ప్రారంభించారు. రెండు మూడు రోజుల కొత్త రీచ్ ప్రారంభం అయిన నేపథ్యంలో ఉన్నట్టుండి రహదారిని మూసివేయడం స్థానికంగా సంచలనంగా మారింది. శనివారం రహదారికి అడ్డంగా జేసీబీలను ఏర్పాటు చేయడంతో మల్లారెడ్డిపల్లి రీచులో ఇసుక లోడింగ్ కోసం వచ్చిన లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
కారణమేంటో..?
మల్లారెడ్డిపల్లిలో మొదట ప్రారంభం అయిన ఇసుక రీచుల నిర్వాహకులు లారీల రాకపోకలకు అనువుగా ప్రత్యేకంగా రహదారి వేసుకున్నారు. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన రీచుకు రాకపోకలు సాగించేందుకు ఇదే రహదారిని వినియోగించుకునేందుకు సమాయత్తం అయినట్టుగా తెలుస్తోంది. అయితే ముందుగా రీచు ఏర్పాటు చేసుకున్న తాము రహదారి కోసం ప్రత్యేకంగా రోడ్డు వేసుకున్నామని ఇందుకు అయిన ఖర్చులు తామే భరించుకున్నామని ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన రీచ్ కు వచ్చే లారీలు కూడా ఇదే రోడ్డును వినియోగించుకోవడం సరికాదని అంటున్నట్టుగా తెలుస్తోంది. తమ రోడ్డు మీదుగా మరో రీచుకు సంబంధించిన వాహనాలు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లకూడని స్పష్టం చేసినట్టుగా సమాచారం. అయితే ఈ రోడ్డును మూసి వేయడంతో రెండు క్వారీలలో కూడా ఇసుక లోడింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో భారీ సంఖ్యలో లారీలు మల్లారెడ్డిపల్లికి నిలిచిపోయాయి. అసలే జరుగుతోందో తెలియక లారీ వాలాలు అయోమయానికి గురవుతున్నారు. డీడీలు తీసుకొచ్చిన తరువాత లోడింగ్ జరగకపోవడంతో తాము నష్టపోతున్నామని లారీ ఓనర్లు అంటున్నారు.