ఆ ఖర్మకిక చెల్లు… రూ. 2 కోట్లతో కర్మకాండ భవనాలు…

దిశ దశ, కరీంనగర్:

సొంతిల్లు లేక అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చివరి శ్వాస విడిచినట్టయితే వారిని అక్కున చేర్చుకునే వారే లేకుండా పోయారు. తమ ఇంటి వారు చనిపోతే నడిఇంట్లో శవాన్ని ఉంచడానికి ఏ మాత్ర వెనకాడని యజమానులు అద్దెకు ఉన్న వారి విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారు. కిరాయి ఇండ్లలో ఉంటున్న కుటుంబాలకు చెందిన వారు చనిపోతే దశ దిన కర్మ పూర్తయ్యే వరకూ వారి బ్రతుకంతా స్మశానాలకే పరిమితం కావల్సిన దుస్థితి తయారైంది. స్మశాన వాటికల వద్ద ఉన్న కొద్దిపాటు గదులు చాలక ఇబ్బందులు పడుతున్నారెందరో. తాజాగా ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోగా అంత్యక్రియలు నిర్వహించిన ఆయన కుటుంబ సభ్యులంతా స్మశాన వాటికలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంటి యజమాని నిరాకరించడంతో ఆటో డ్రైవర్ ఫ్యామిలీ అంతా స్మశనంలోనే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కర్మకాండ భవన్ లు నిర్మించేందుకు చొరవ తీసుకోవాలని కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, పాలకవర్గానికి సూచించారు. ఈ మేరకు మంగళవారం మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారుల బృందం కరీంనగర్ లోని నాలుగు స్మశాన వాటికలను పరిశీలించారు. రూ. 50 లక్షలకో భవన్ చొప్పున నాలుగింటిని నిర్మించాలని నిర్ణయించినట్టు మేయర్ శ్రీనివాస్ ప్రకటించారు, జిప్లస్ వన్ బిల్డింగులు నిర్మించి కరీంనగర్ లో అద్దెకుంటున్న కుటంబాలకు చెందిన వారు చనిపోతే నామమాత్రపు ఛార్జీలతో వసతి కల్పించనున్నామని వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సలహా మేరకు నాలుగు స్మశాన వాటికలను పరిశీలించి, స్థలాలను ఎంపిక చేయడం జరిగిందని మేయర్ వెల్లడించారు. అంతేకాకుండా కరీంనగర్ లో నివాసం ఉంటున్న వారికి ‘‘ఆఖరీ సఫర్’’ కార్యక్రమం అమలు చేసే విధంగా చొరవ తీసుకోనున్నామని కూడా ప్రకటించారు. ఆధార్ కార్డ్ అడ్రస్ ఎక్కడున్నా సరే వారు కరీంనగర్ లో నివాసం ఉంటున్నట్టయితే ఒక రూపాయికే అంత్యక్రియలు కార్యక్రమం అమలు చేస్తామన్నారు. ఇందుకు సంబంధిత కార్పొరేటర్, ఏరియా జవాన్ సర్టిపై చేస్తే ఈ పథకం అమలు చేయనున్నామన్నారు.

bandi sanjay bjpkarimnagarkarimnagar newsLatest NewsMCK
Comments (0)
Add Comment