దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విబేధాలు రచ్చకెక్కాయి. ఇప్పటికే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో మరోసారి సమావేశం రసాభసాగా మారిపోయింది. మంగళవారం బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం జరగింది. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ అసెంబ్లీ కోఆర్డినేటర్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిలు హాజరయ్యారు. అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని, సీనియర్ల ప్రాతినిథ్యం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. సీనియర్లకు గుర్తింపు ఇవ్వడం లేదంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా ఛైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి పార్టీ శ్రేణులను సముదాయించేందుకు శ్రమించాల్సి వచ్చింది.